న్యూఢిల్లీ, మార్చి 25: పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) అందుబాటులో ఉన్న చోట వినియోగదారులు దానికి మారడంలో విఫలమైన పక్షంలో ఎల్పీజీ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 24న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ జారీ చేసిన కొత్త ఉత్తర్వు ప్రకారం నోటిఫికేషన్ అందిన తర్వాత కుటుంబాలకు పీఎన్జీని ఎంచుకోవడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంటుంది. లేకపోతే ఎల్పీజీ సదుపాయాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత్ ఎల్పీజీ కొరతతో సతమతమవుతున్నది. భిన్న వనరులు, దేశీయ ఉత్పత్తి కారణంగా పీఎన్జీ వైపు ప్రభుత్వం ప్రస్తుతం గృహ, వాణిజ్య వినియోగదారులను ప్రోత్సహిస్తున్నది. ఎల్పీజీ సిలిండర్ల మాదిరి కాకుం డా పీఎన్జీని నేరుగా వంటింట్లోకే పైపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం
ఒకసారి అధీకృత సంస్థ ఒక కుటుంబానికి పీఎన్జీ అందుబాటులో ఉందని తెలియచేస్తే పీఎన్జీకి మారడం ఇక ఐచ్ఛికం కాదని ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేస్తున్నది. సమాచారం అందిన మూడు నెలల తర్వాత ఆ చిరునామాకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుందని ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది. అయితే ఇక్కడ ఒక షరతు కూడా ఉంది. సరఫరాదారు జారీచేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌కు లోబడి పీఎన్జీ కనెక్షన్ అందించడం అసాధ్యమైనపుడు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్ కొనసాగుతుంది. దేశమంతటా గ్యాస్ పైపులైన్ల ఏర్పాటును వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. పైప్లైన్లు వేయడానికి అనుమతులను ఇకపై నిర్దిష్ట కాలపరిమితిలోగా మంజూరు చేయా ల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే అవి ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. గృహ సముదాయాల్లో 3 పనిదినాల్లోపు పీఎన్జీ అందుబాటులోకి తేవాలి. కాగా, చివరి దశ పీఎన్జీ కనెక్షన్లను 48 గంటల్లోపు అందించాలి. దరఖాస్తులను తిరస్కరించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ సరఫరాను నిలిపివేసి వాటిని పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలకు మళ్లించడమే ఈ కొత్త నిబంధనలు తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.