Congress | మొన్న సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మనం చూడని కరెంటు కష్టాలా. కరెంటు కోతలు, సబ్స్టేషన్ల ముట్టడి, అధికారుల ముట్టడి.. రైతన్నల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కర్ణాటక మన కండ్ల ముందే కనిపిస్తున్నది. నిరంతరం కరెంటు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్ ముక్కుతూ మూలుగుతూ 5 గంటల కరెంటు ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నది. ప్రజలను గోస పెడుతున్నది. కన్నడ రైతులు ట్యాంకర్లతో పంటలు, కన్నీళ్లతో గొంతు తడుపు కొంటున్నారు. మరీ ‘మూడు గంటల కరెంటే మా విధానం’ అని ఎన్నికల ముందే ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ఇంక మనకేం కరెంటిస్తుంది. పాలిచ్చి పామును పెంచితే అది మనల్నే కాటేస్తుంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది కరెంటు ‘కాటు’వేసి మనల్ని కాటికి పంపిస్తుంది.
మొన్న
మోటర్ల కాలుడు.. ట్రాన్స్ఫార్మర్ల పేలుడు.. అర్ధరాత్రి బావికాడ పండుడు. పాముకాటుకు బలై కాటికిపోవుడు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో
నిన్న
వ్యవసాయానికి 5 గంటల పాటు కరెంటు ఇస్తాం. పండుగ చేస్కోండి’
కేజే జార్జ్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి
నేడు
‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండుగ. మూడు గంటలు చాలు’
రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్
కరెంటు.. కాంగ్రెస్ ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం ఉంది.. కానీ ఆ కరెంటును ప్రజా అవసరాలకు సరిపడేంత అందించడంలో కాదు.. కరెంటుతో ప్రజలను ఎలా కష్టపెట్టవచ్చనే ప్రయోగాలు చేయడంలో కాంగ్రెస్ తరువాతే ఎవరైనా. అందుకే కరెంటు.. కాంగ్రెస్.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం ఉందని అన్నది.
దేశాన్ని దాదాపు 60 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఏనాడుకూడా.. దేశం మొత్తం కాదు.. ఏ రాష్ట్రంలోకూడా 24 గంటల కరెంటు ఇచ్చిన సందర్భం లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. అక్కడ కరెంటు వ్యవస్థలను కుప్పకూల్చి.. ప్రజలకు విద్యుత్తు కష్టాలు, బాధలను రుచి చూపించిగానీ వదలని ఏలినాటి శని కాంగ్రెస్ పార్టీ. కేవలం విద్యుత్తుపైనే ఆధారపడిన రైతాంగానికి చుక్కలు చూపించి.. పంటలను ఎండబెట్టి.. రైతులను అప్పులపాల్జేసి.. వారు బలవన్మరణానికి గురైతేగానీ.. అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నేతల మనస్సులు చల్లారవు. ఇచ్చే రెండు, 3 గంటల విద్యుత్తు అయినా.. రాత్రనక పగలనకా ఇచ్చి రైతుల ప్రాణాలను విషపురుగులు, పాములు, తేలు కాట్లకు బలి ఇచ్చేలా పరిస్థితులను సృష్టించేదే కాంగ్రెస్ పార్టీ. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. పైగా విద్యుత్తుపై కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ సరైన అవగాహన లేదు. ఎవరికి ఎన్ని గంటలు అవసరం.. దానిని ఎలా ఉత్పత్తి చేయాలి.. ఎలా సరఫరా చేయాలి.. వ్యవస్థలను ఎలా బలోపేతం చేయాలనే ఆలోచనలే వారికి రావు.
Power F
ఏడు గంటలన్నారు..
సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏడుగంటల పాటు విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తామని నమ్మకంగా చెప్పారు. కానీ అప్పటి కాంగ్రెస్ 10 సంవత్సరాల పరిపాలనలో.. ఏనాడుకూడా 7 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందించిందీ లేదు. ఐదు గంటలు విద్యుత్తు ఇస్తే అదే మహా ప్రసాదం అనే పరిస్థితి నెలకొంది. ఆ ఐదు గంటలుకూడా మూణ్నాలుగు విడతలుగా.. అదికూడా అర్ధరాత్రి ఇచ్చే సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టే. కరెంటు సరిగ్గా ఇవ్వక.. ఇచ్చినా లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి..ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. విద్యుత్తు శాఖ దగ్గర సరిపోయినంత సిబ్బందికానీ.. ట్రాన్స్ఫార్మర్లుగానీ ఉండేవి కాదు. దీనితో రైతులే చందాలేసుకుని వాహనాల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను తీసుకుని.. ఎమ్మెల్యేతోగానీ, మంత్రితోగానీ సిఫార్సు చేయించి.. ఆమ్యామ్యాలిస్తేనే ట్రాన్స్ఫార్మర్ మూణ్నాలుగు రోజుల తరువాత తిరిగి వచ్చేది. ఈలోపు పంటలన్నీ ఎండిపోయేవి. ఇక రాత్రిపూట వచ్చే విడతల కరెంటు కోసం.. రైతులు పొలాల దగ్గర, చేలల్ల నిద్రించేవారు. దీనితో పాములు, తేళ్లు, విషపురుగుల కాట్లకు గురై చనిపోయిన రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. విద్యుత్తు శాఖ అధికారుల దిగ్బంధనం, సబ్ స్టేషన్ల ముట్టడి, ప్రజాప్రతినిధుల అడ్డగింపు, నిలదీతలు.. పోలీసు కేసులు, స్టేషన్లలో రైతన్నల అరెస్టులు షరా మామూలుగానే ఉండేవి. విద్యుత్తు కోతలతో ఎండిపోయిన పంటలను అసెంబ్లీలో ప్రదర్శించడం ఆనవాయితీగా మార్చింది కాంగ్రెస్ పార్టీయే.
పక్క రాష్ట్రంలో ఐదు గంటలన్నారు..
మొన్నటికి మొన్న మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మొదట్లో ఏడు గంటలన్నారు. కానీ ఆఖరికి ఐదు గంటలు కచ్చితంగా.. నిరంతరాయంగా ఇస్తామంటూ సీఎంతోపాటు విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ ప్రకటన చేశారు. షరా మామూలుగానే కాంగ్రెస్ పార్టీ నరనరాన జీర్ణించుకున్న.. కరెంట్‌ను కటకట చేయడంలో సఫలం అయ్యింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ చూసినా.. రైతాంగం ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు చేస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులను నిలదీస్తున్నారు.. నిర్బంధిస్తున్నారు. సబ్ స్టేషన్లను దిగ్బంధిస్తున్నారు. కనీసం ఐదు గంటలుకూడా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాంరా భగవంతుడా అంటూ.. తమను తామే నిందించుకుంటున్నారు.
మూడు గంటలు చాలా..?
ఇక మన రేవంత్‌రెడ్డి.. కాదు కాదు.. రేటెంత రెడ్డి అన్న మాటలు చూస్తే.. అసలు వీళ్లకు కరెంటుపై అవగాహన ఉందా.. వ్యవసాయం గురించి తెలుసా.. అనే అనుమానాలు రాకమానవు. రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా మూడు గంటల విద్యుత్తు ఇస్తే.. మళ్ళీ మనం ఎక్కడికి పోతామనేది ప్రజలు గుర్తించుకోవాలి. ఏడు గంటలని చెప్పి.. ఐదు గంటలుకూడా సరిగ్గా ఇవ్వలేని కాంగ్రెస్ పాలనను చవిచూసి.. చావుతప్పి కన్నులొట్టపోయిన తెలంగాణ రైతాంగం.. ఇప్పుడు మూడు గంటలు చాలంటున్న కాంగ్రెస్ నేతలను గెలిపిస్తే.. ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టో అర్థం చేసుకోవాలి. పాముకు పాలు పోసి పెంచితే.. కాటు వేయక మానుతుందా.. తప్పకుండా కాటు వేస్తుంది. అలాగే మూడు గంటల విద్యుత్తు మాత్రమే అందిస్తే.. ఇప్పుడిప్పుడే దిద్దుకుంటున్న తెలంగాణ సమాజంలో.. నిప్పులు పోసినట్టే. మళ్ళీ కరెంటు కోతలు తప్పవు. పంటలు ఎండిపోవటం ఖాయం. మోటర్లు కాలడం.. ట్రాన్స్ఫార్మర్లు పేలడం చూడాల్సిందే. విద్యుత్తు కోతలు, పరిశ్రమలకు వాతలు.. గృహ, వినియోగదారులు నిద్రలేని రాత్రులు.. వాణిజ్య వినియోగదారులు ఈగలు తోలుకుంటూ బతకాల్సిన దుస్థితి రాకమానదు. ఒక రైతుకు కనీసం ఎంత విద్యుత్తు అవసరం అనేదే సరిగ్గా తెలియని నేతలకు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. రాష్ట్రం మొత్తం విద్యుత్తు అవసరాలను ఎలా తీర్చుతారు? తెలంగాణ రైతాంగం ముందుగానే గ్రహించి జాగ్రత్త పడాలి. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఆగం కావడం ఖాయమనేది ఆలోచించి.. రైతాంగం ఆగం కాకుండా.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడు గంటల కరెంటు కావాలా.. 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తు కావాలా అనేది రైతాంగమే నిర్ణయించుకోవాలి.
…? ఎక్కల్దేవి శ్రీనివాస్