సంగారెడ్డి : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాల్లోకి వేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) ఆరోపించారు. రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో నోబెల్ ఫ్రైజ్ ( Nobel Prize ) ఇస్తే అది రేవంత్‌రెడ్డికే ఇవ్వాలని విమర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90 శాతం గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది. సంగారెడ్డిలో 34 సర్పంచులు గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 66 శాతం గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ముఖానికి ఎరువులు ఇచ్చే తెలివి లేదని అన్నారు.పంట పండాలంటే నీళ్లు కావాలి. కరెంటు కావాలి. ఎరువులు కావాలి.రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అప్పులు కావాలి. మ్యాపులు కావాలి అంటున్నాడు.ఎరువు బస్తాలు కావాలంటే యాప్‌లో కొట్టండి అంటున్నాడు. ఎప్పుడైనా నీ మొఖానికి వ్యవసాయం చేసావా? రైతుల కష్టం మీకు తెలుసా? నని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్. నీళ్లు ఫుల్. ఎరువులు ఫుల్.రేవంత్ రెడ్డి వచ్చినంక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు, కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు, ఎరువుల కోసం లైన్ లో నిలబడి గోసపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదని తెలిపారు.ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ధైర్యముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలి ..

మున్సిపాలిటీల పదవి కాలం పూర్తయి సంవత్సరమవుతున్నా ఎన్నికలు పెట్టట్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు.కోపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కూడా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుందామని జీవో ఇచ్చారని హరీష్ రావు వెల్లడించారు. ధైర్యముంటే, రైతులకు మేలు చేసే నాయకుడివి అయితే నామినేటేడ్ కాకుండా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
15వ ఆర్థిక సంఘం డబ్బులు 85 శాతం ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయని ఎవరూ కూడా దానిని ఆపలేరని తెలిపారు. ఏ ప్రజాప్రతినిధికి లేని చెక్ పవర్ సర్పంచ్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. గెలిచిన సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు.
మనుమడు సోకు తీర్చడానికి వందకోట్లు ఖర్చు
మనుమడు సోకు తీర్చడానికి రేవంత్ రెడ్డి వందకోట్లు ఖర్చు చేశాడని, ప్రభుత్వ ఖజనా నుంచి రూ. 5 కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కట్టించుకున్నాడని మాజీ మంత్రి ఆరోపించారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేయడం కాదని సొంత డబ్బుతో కట్టుకోవాలని సూచించారు. సింగరేణి సీఎస్సార్ డబ్బులతో కేసీఆర్ స్కూళ్లు కట్టించిండు. రోడ్లు ఏపించిండు. మెడికల్ కాలేజీలు పెట్టించాడని అన్నారు.
అందాల పోటీలు పెట్టాలి. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాలి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో సోకులు చేయాలి. ఢిల్లీకి హైదరాబాద్ కి చక్కర్లు కొట్టాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.