పటాన్చెరు, సెప్టెంబర్ 27: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో హైడ్రా యాక్షన్ ఉండబోతుందా? ఈ ఆదివారం అదే ప్రత్యేకం కావచ్చా? అంటే అవుననే సంకేతాలు పటాన్చెరు సాకీ చెరువు వద్ద వినిపిస్తున్నాయి. శుక్రవారం హైడ్రా అధికారుల బృందం వచ్చి సాకి చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించినట్టు గుర్తించిన భవనాలకు ఎర్ర సిరా మార్క్ వేసింది. దీంతో ఆ భవన యజమానుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నది. హైడ్రా ఆదేశాలతో జీహెచ్ఎంసీ పటాన్చెరు సిబ్బంది.. ఇండ్ల యజమానులకు శుక్రవారం నోటీసులను అందజేశారు. దీంతో వారంతా హడావుడిగా ప్రముఖ నేతలను కలిసి కాపాడాలని విన్నవించుకుంటున్నారు.
2021లో అధికారులు సాకీ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను సర్వేచేసి గుర్తించారు. 18 అక్రమ నిర్మాణాలు చెరువులో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 31న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పటాన్‌చెరుకు వచ్చి సాకి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు ఎఫ్టీఎల్లో, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాల గురించి అధికారుల వద్ద వివరాల తీసుకున్నారు. కొన్ని నిర్మాణాలపై కోర్టు కేసులు ఉన్నాయని అధికారులు, స్థానికులు తెలపడంతో వాటి వివరాలు సేకరించి వెళ్లిపోయారు.
ఆరుగురికి హైకోర్టు ఆర్డర్?
గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై విభాగం సైతం సాకి చెరువులోని ఆక్రమణలను తొలిగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దానిపై చర్యలకు ఆనాటి అధికారులు వెనుకాడారు. ఇప్పుడు హైడ్రా యాక్టివ్‌గా చెరువుల్లో ఆక్రమణలు తొలిగిస్తుండటంతో ఆరుగురు హైకోర్టు నుంచి కూల్చివేతలను నిలిపివేసేందుకు ఆర్డర్ తెచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. అటు జీహెచ్ఎంసీ ఉప కమిషనర్, ఇటు పటాన్చెరు తహసీల్దార్ తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదని స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్లలో ఏమున్నది? ఎంతవరకు ఆ ఆర్డర్లు హైడ్రా చర్యలను నిలువరించగలవు అనేది ఆసక్తికరంగా మారింది.