హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఒక వైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తెలోకి ప్రవేశించిన నాటి నుంచి వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతున్నది. గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల పురోగమనం రాష్ట్రంలో వర్షాలు కురువడానికి ఆస్కారం కల్పించింది.
కేరళ తీరాన్ని ఆనుకొని ఉన్న నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవుల పక్కనే ఉన్న లక్షదీవుల్లోకి పూర్తిగా ప్రవేశించాయని పేర్కొన్నది. అలాగే దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలపడి, ధాటిగాగా వీస్తున్నాయని తెలిపింది. దీంతో ఈ నెల 31 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
కాగా శనివారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి, మహబూబాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా ఎర్రారం 5, సంగారెడ్డి జిల్లా మానూరు 4.28, సిద్దిపేట జిల్లా రామారం 4.1 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. రోహిణి కార్తెలో కురుస్తున్న వర్షాలకు రైతులు భూమిని దున్ని దుక్కులు సిద్ధం చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అలాగే భూమిలో సారం పెంచుకోవడానికి వీలుగా పచ్చి రొట్టను కూడ ఇప్పుడు వేసుకోవచ్చునని అంటున్నారు. ఇప్పుడు భూమిని దున్నుకోవడం వల్ల పంటలో కలుపు రాకుండా నివారించుకోవడానికి వీలవుతుందని చెపుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలపైన, 7 జిల్లాల్లో 39 డిగ్రీలపైన, 5 జిల్లాల్లో 38 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంక, తంగుల 42.4, పెద్దపల్లి జిల్లా మంథని, 42.2 ఆదిలాబాద్ జిల్లా భోరజ్, జైనథ్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.