హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శాఖలో సిబ్బంది లేక, ఉన్నవారికి వేతనాలు రాని దుస్థితి నెలకొన్నది. ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధరిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు ఏడాది గడిచినా ఆ దిశగా చ ర్యలు చేపట్టలేదు. మరోవైపు ఇరిగేషన్ శాఖలోనూ పూర్తిగా విలీనం చేయలేదు. ఐడీసీలో 262మందికి గాను ప్రస్తుతం 118 మంది మాత్రమే ఉన్నారు. వా రిలో రెగ్యులర్ సిబ్బంది 27మంది ఉండగా, మిగతా వారు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికపైనే పనిచేస్తున్నారు. రెగ్యుల ర్ సిబ్బందిలో కీలకమైన టెక్నికల్ స్టాఫ్ ప్రస్తుతం 8మంది కాగా, ముగ్గురు త్వరలో విరమణ పొందనున్నారు. ఇక ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మొన్నటిదాకా సర్వీస్ కంటిన్యూయేషన్ ఆర్డర్లు ఇవ్వక వేతనాలు నిలిపివేసింది. ఇప్పుడు ఆర్డర్లు వచ్చి రెండు నెలలైనా విడుదల చేయడం లేదు.
ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఐడీసీని 2020లో సాగునీటి పారుదల శాఖలో విలీనం చేసింది. ఐడీసీ స్కీములన్నింటినీ టెరిటోరియల్ సీఈల పరిధిలోకి తీసుకొచ్చింది. సి బ్బంది విలీన ప్రక్రియ మాత్రం మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు గతేడాది బోర్డు సమావేశం నిర్వహించారు. 9వ షెడ్యూల్ ప్రకారం ఐడీసీని స్వ తంత్ర శాఖగా పునరుద్ధరించాల్సి ఉన్నదని ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. కానీ ఏడాది గడచినా పట్టింపులేదు. జిల్లాల్లో ఉన్న ఐడీసీ సిబ్బంది ప్రస్తుతం ఆయా సీఈల పరిధిలోనే పనిచేస్తున్నా హెడ్ఆఫీసులో మాత్రం గందరగోళంగా మారింది.