హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగానికి అధునాతన సాంకేతికతను అందిస్తున్న ఇక్రిశాట్.. ఐఐటీ ఖరగ్‌పూర్‌తో కలిసి మరో వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగు దిగుబడి, పంటల రోగ నిరోధకతను పెంచడంలో కీలకమైన మట్టిలోని పోషకాలను సమర్థవంతంగా గుర్తించే సులభమైన విధానాన్ని డెవలప్ చేసింది. అధునాతన టెక్నాలజీతో పనిచేస్తూ 80 శాతం కచ్చితమైన ఫలితాలను వెల్లడించే సాయిల్ టెస్ట్ మేనేజ్మెంట్ పేరిట ప్రత్యేక సాంకేతికతను డిజైన్ చేశారు. డిఫ్యూజ్ రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ(డీఆర్ఎస్)విధానంలో పనిచేస్తూ నిమిషాల్లోనే మట్టి నాణ్యత ఫలితాలను పొందవచ్చని, భూసారాన్ని బట్టి పంట రకాలను ఎంపిక చేసుకోవచ్చని చెప్తున్నారు.
అధునాతన టెక్నాలజీతో సాయిల్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ల్యాబోరేటరీని ఇక్రిశాట్లో ఏర్పాటుచేశారు. ఏకకాలంలో 250కి పైగా శాంపిళ్లను పరీక్షించేందుకు వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రాథమిక మట్టి నాణ్యత, మట్టిలోని స్థూల, సూక్ష్మ పోషకాలను అంచనా వేసేందుకు 14 రకాల పరీక్షలను నిర్వహించవచ్చు. ప్లాస్మా ఆప్టికల్ విధానం ద్వారా మట్టి నాణ్యతను తెలుసుకునే వీలుంది. ఇప్పటివరకు ఈ ల్యాబొరేటరీ ద్వారా 2,86,449 మట్టి శాంపిళ్లను విశ్లేషణ చేయగా, 4.5 లక్షల పంటలను అధ్యయనం చేశారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మట్టి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల వాతావరణ, నీటి లభ్యత ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సూచిస్తున్నారు.