హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పంటల్లో క్యాన్సర్ కారకాలను అరికట్టడంపై ఇక్రిశాట్ దృష్టి సారించింది. ప్రజారోగ్యానికి హానిచేసే అఫ్లోటాక్సిన్లను కట్టడి చేసేలా అంతర్జాతీయ స్థాయి అధ్యయనానికి కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా పంట దశలో కార్సినోజెనిక్ అవశేషాలను గుర్తించి నిర్వీర్యం చేసే ఆధునిక విధానాలను అమలు చేయడంతోపాటు అప్లోటాక్సిన్లు, తెగుళ్లను మరింత సమర్థంగా తట్టుకోగలిగే వంగడాలను అభివృద్ధి చేసేందుకు జర్మనీ అగ్రిటెక్ సంస్థతో కలిసి పరిశోధనలు జరుపనున్నది. ఎగుమతికి మంచి డిమాండ్ ఉన్న వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలకు ఫంగస్ సోకుతుండటంతో క్యాన్సర్ కారకాలైన అఫ్లోటాక్సిన్లు పరిమితికి మించి వ్యాప్తి చెందుతున్నాయి. దీనివల్ల ఆయా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దేశీయంగా పంటల్లో అప్లోటాక్సిన్లను నియంత్రించడంపై ఇక్రిశాట్ ఇప్పటికే దృష్టి సారించడంతో కొంత మేర ఫలితాలు వస్తున్నాయి. కానీ, ఆఫ్రికా ఖండంలోని ప్రధాన పంటల్లో హానికారక రసాయన అవశేషాలు విరివిగా కనిపిస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు ఉమ్మడి పరిశోధనలు దోహదం చేస్తాయని ఇక్రిశాట్ వర్గాలు భావిస్తున్నాయి.