CAR T therapy | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ రోగంపై పోరాడే ఖరీదైన కార్-టీ థెరపీ ఇక ప్రభుత్వ దవాఖానల్లో పేద రోగులకు సైతం అందుబాటులోకి రానుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) సాయంతో జరిగిన ఫేజ్-1 ట్రయల్స్‌లో ఈ ప్రయోగం విజయవంతమైంది. క్యాన్సర్‌పై పోరాడేందుకు రోగి టీ సెల్స్ (తెల్ల రక్త కణాలు)ను ఉపయోగించి చేసే కార్-టీ థెరపీని ఇకపై తక్కువ ఖర్చుతో సురక్షితంగా తయారుచేసి దవాఖానలోనే దానిని రోగికి ఇవ్వవచ్చని ఓ అధ్యయన నివేదికను మాలిక్యులర్ థెరపీ ఆంకాలజీ పత్రికలో ప్రచురించారు. ఈ అధ్యయనానికి అవసరమైన నిధులను ఐసీఎంఆర్ సమకూర్చింది. ప్రస్తుతం ఎంతో ఖరీదైనదిగా ఉన్న ఈ చికిత్సను పేదలకు, ప్రభుత్వ దవాఖానలో లేదా చిన్నపాటి క్లినిక్‌లో రోగి పడుకున్న బెడ్‌పైనే అందించవచ్చని పేర్కొన్నారు. రక్తం, ఎముక మజ్జలో వచ్చే క్యాన్సర్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బీ-సెల్ లింఫోమా రోగులకు ఈ చికిత్సను అందించారు.
మొదటి దశ పరీక్షలలో ఈ చికిత్స లుకేమియా రోగులకు 100 శాతం ఉపశమనం కలిగించింది. లింఫోమా రోగుల్లో 50శాతం స్పందన కనిపించగా, 80 శాతం మంది రోగులు 15 నెలల్లో వ్యాధిరహితంగా మారిపోయారు. అయితే వారిలో తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో రోగుల శరీరంలో క్యాన్సర్‌పై పోరాడే టీ కణాలను సేకరించి, వాటిని ఒక పరిశోధనశాలకు పంపిస్తారు. చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ (కార్) అనే ప్రత్యేకమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా అక్కడ వాటిని జన్యుపరంగా మార్పిడి చేస్తారు. ఆ కార్-టీ కణాలు లక్షల సంఖ్యలో పెరిగే వరకూ వేచి చూసి, ఆ తరువాత వాటిని రోగి రక్త ప్రసరణలోకి ఇంజెక్ట్ చేస్తారు. కానీ తాజా పరిశోధన ప్రకారం రోగి టీ కణాలను అతడు చికిత్స పొందుతున్న దవాఖానలోనే జన్యుపరంగా మార్పిడి చేశారు. తద్వారా తాజాగా ఉన్న కణాలను రోగికి వెంటనే ఇంజెక్ట్ చేయడం ద్వారా విజయవంతమైన ఫలితాలను పొందగలిగామని పరిశోధకులు వెల్లడించారు.