హనుమకొండ చౌరస్తా, మార్చి 5: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ 2024 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ఐసెట్-2024 నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు వైస్ చాన్స్లర్, టీఎస్ఐసెట్-24 చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ మల్లారెడ్డితో కలిసి కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఐసెట్ కోసం విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీలోపు సమర్పించవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, ఇతరులు రూ.750 రుసుము చెల్లించి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు.
రూ.250 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 27వ తేదీ వరకు గడువు ఉందని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే మే 17వ తేదీ నుంచి 20 తేదీ మధ్య మార్పులు చేసుకోవచ్చని సూచించారు. మే 28వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో ఉంటుందని, జూన్ 4న 2 సెషన్లు, 5న ఒక సెషన్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జూన్ 15న ప్రాథమిక కీ, జూన్ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాల స్వీకరణ, చివరి కీ ఫలితాలను జూన్ 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పూర్వపు కన్వీనర్ ప్రొఫెసర్ పీ వరలక్ష్మి, కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్, డీన్ ప్రొఫెసర్ పీ అమరవేణి, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ ఎం సదానందం, డాక్టర్ సీహెచ్ రాధిక పాల్గొన్నారు.