Child Marriage | బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మైనర్ బాలిక జీవితం నాశనమైంది. కనీసం పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోకుండా.. బాల వధువుకు బదులు ఆమె చెల్లిని సంరక్షణా కేంద్రానికి తీసుకెళ్లిపోయారు. ఇదే ఛాన్స్ అని పెద్దలు ఆ వివాహాన్ని జరిపించేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్, పోలీసు అధికారుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ధరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో గద్వాలకు చెందిన బాలికతో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈ వివాహం గురించి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే వారు గద్వాల మండలంలో పెళ్లి జరుగుతున్న గ్రామానికి వెళ్లారు. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మైనర్ అయిన పెళ్లి కూతురును పెద్దలు అక్కడి నుంచి తప్పించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడకు వచ్చిన అధికారులకు అక్కడ పెళ్లి కూతురు ఉందో లేదో కూడా సరిగ్గా చూసుకోలేదు. పెళ్లి కూతురి చెల్లినే వధువు అని అనుకున్నారు. కనీసం పెళ్లి పత్రికలో పేరు, ఆధార్ కార్డులో ఫొటోలు పరిశీలించకుండానే పెళ్లి కూతురు చెల్లిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి ఆగిపోవద్దనే ఉద్దేశంతో పెద్దలు కూడా సైలెంట్‌గా ఉండిపోయారు. చిన్నమ్మాయిని తీసుకెళ్తున్నా మౌనంగా ఉన్నారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
అధికారులు వెళ్లిపోయిన వెంటనే మైనర్ బాలికకు పెద్దలు గుడిలో పెళ్లి చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాలిక ఆధార్ కార్డును, పెళ్లి పత్రికను చూడకుండా కనబడ్డ బాలికను ఐసీడీఎస్ అధికారులు తీసుకురావడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులను మందలించారు. అనంతరం గద్వాల జిల్లా అడిషనల్ ఎస్పీ, ధరూర్, గద్వాల రూర్ ఎస్సైలు, ఐసీడీఎస్ అధికారులు గురువారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే వధూవరులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం పోలీసులు, ఐడీసీఎస్ అధికారులు గాలిస్తున్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.