నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పైరసీ మూవీ రాకెట్ ఐ-బొమ్మ కీలక సూత్రధారి ఇమంది రవిని 5రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి ఉండటంతో విచారణకు సమయం సరిపోలేదని, నిందితుడు కూడా సహకరించలేదని పీపీ కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రవిని ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనల్ని ఏకీభవిస్తూ కోర్టు షరతులు విధించింది. థర్డ్ డిగ్రీని ఉపయోగించరాదని, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిందితుడిని ప్రశ్నించాలని సూచించింది. నిందితుడి తరఫు న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని, గురువారం నుంచి సోమవారంవరకు విచారణ పూర్తిచేసి సాయంత్రం 5 గంటల్లోగా దవాఖానలో పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపర్చాలని పేర్కొంది.
విచారణ నిమిత్తం నిందితుడిని గురువారం చంచల్‌గూడ జైలు నుంచి సైబర్‌క్రైమ్ కార్యాలయానికి తరలించనున్నారు. క్రిప్టో కరెన్సీ నుంచి భారత కరెన్సీకి బదిలీ చేసినట్టు ఆధారాలు లభించడంతో అదనంగా 336(3), 338, 340 (2) ఆఫ్ బీఎన్ఎస్-2023 సెక్షన్లను జోడించేందుకు అనుమతివ్వాలని కోరుతూ అధికారులు మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఉన్న దుద్దెల శివాజీ (ఏ2), సూసర్ల ప్రశాంత్ (ఏ3)ల సమక్షంలో రవిని అధికారులు విచారించనున్నారు. సూసర్ల ప్రశాంత్‌ను సెప్టెంబర్ 24న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అలాగే ప్రశాంత్‌కు మాత్రం 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. తెలుగు ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ హెడ్ యార్ర మనీంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలుగు సినిమా ప్రొడ్యూసర్లను బెదిరిస్తూ పోస్టు చేసిన మెసేజ్‌లపై కూడా విచారణ చేపట్టనున్నారు.