హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొత్త సినిమాలు, ఓటీటీల్లోని కంటెంట్‌ను పైరసీ చేసి, ఐబొమ్మ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు అందిన సమాచారంతో సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్విస్ట్రా ఫ్లాట్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రవి స్వస్థలం విశాఖపట్నం అని, కరేబియన్ దీవులలో ఉంటూ సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్టు తెలిపారు.
కూకట్‌పల్లిలోని రవి నివాసం నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్, సర్వర్ నుంచి సమాచారం సేకరించారు. భార్యతో విడాకులు తీసుకున్న రవి ఒంటరిగా కరేబియన్ దీవులలో నివసిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ కాపీని ఐబొమ్మలో రిలీజ్ చేయడంతో తెలుగు సినీ పరిశ్రమకు 3వేల కోట్లు, మొత్తం అన్ని భాషల సినీ పరిశ్రమలకు 22వేల కోట్ల నష్టం జరిగినట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐబొమ్మ నిర్వాహకులు గతంలో పోలీసులకు సవాల్ విసిరారు. దమ్ముంటే తమను పట్టుకోవాలని వెబ్సైట్లో పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సినీపరిశ్రమ పెద్దల ఫిర్యాదుతో పోలీసులు 69 వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఇంతకుముందు హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ వీసీ సజ్జనార్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సీవీ ఆనంద్ బదిలీ అయ్యే ముందు.. థియేటర్లలో సినిమాలు రికార్డ్చేస్తూ సర్వర్లు హ్యాక్ చేస్తున్న ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకులపై కూడా నిఘా పెట్టామని, త్వరలోనే పట్టుకుంటామని అప్పుడే మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఐబొమ్మ నిర్వాహకుల కదలికలను సాంకేతిక ఆధారాల ద్వారా పసిగట్టారు. కూకట్‌పల్లిలోని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అతని అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. రవితోపాటు ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాల్లో వందల కోట్లు ఉన్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. ఇమ్మడి రవిని విచారించే క్రమంలో కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలిసింది.
ఐబొమ్మ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉన్నదని, గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఐబొమ్మ ఏజెంట్లను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు కీలకంగా పనిచేసిన రవి అరెస్ట్ తర్వాత మరికొన్ని అరెస్ట్‌లు ఉంటాయని తెలుస్తున్నది. ఇప్పటికే ఏపీ , తెలంగాణలతోపాటు పలు రాష్ర్టాల్లో ఐబొమ్మ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. పైరసీ వ్యవహారం మొత్తం రవి ఒక్కడే నడిపిస్తున్నాడా లేక అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దృష్టిపెట్టారు. ఐబొమ్మలో బెట్టింగ్ యా ప్ల ప్రకటనల ద్వారా కూడా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీఎస్‌లో విచారణ తర్వాత రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
పోలీసులకే సవాల్ విసురుతూ వైబ్‌సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి పట్టుబడటం వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో పోలీసులకు కొన్ని అకౌంట్స్ వివరాలు లభించాయి. ఇందులో ఐబొమ్మతో జరిపిన లావాదేవీలు బయటపడ్డాయి. వీటి ఆధారంగా కూపీ లాగగా.. ఐబొమ్మ గుట్టురట్టయిందని తెలుస్తున్నది. అలాగే రవి భార్య పోలీసులకు ఇచ్చిన సమాచారం అరెస్ట్‌కు అత్యంత కీలకమైనట్టు సమాచారం. వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవి కరేబియన్దీవుల్లో ఐబొమ్మ ఆఫీసు నడిపిస్తున్నాడు. తనతో పనిచేసిన అశ్విన్‌కుమార్, కిరణ్కుమార్లాంటి వారికి లక్షల రూపాయలు చెల్లించేవాడు. బెట్టింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీల సమాచారం తీసుకున్న పోలీసులు.. ఇమ్మడి రవి భార్యను విచారించారు. ఇప్పటికే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవి హైదరాబాద్‌కు వస్తున్నట్టు అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
ఐబొమ్మకు చెందిన అశ్విన్‌కుమార్ అనే హ్యాకర్‌ను పోలీసులు నిరుడు సెప్టెంబర్ చివరలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో జానా కిరణ్‌కుమార్‌తోపాటు మరో పదిమందిని అశ్విన్‌కుమార్‌ను విచారించే సమయంలో వాళ్లు సమాచారంతో మొత్తం పైరసీ సిండికేట్‌కు సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే సినీవర్గాలు తమ సినిమా పైరసీ కాకుండా హైలెవల్ సెక్యూరిటీ కోసం డిజిటల్ సర్వర్లలో భద్రపర్చుకుంటారు. కానీ ఆ సర్వర్లను కూడా ఐబొమ్మ నిర్వాహకులు హ్యాక్ చేసి, తమ దగ్గర సర్వర్ నుంచి పైరసీ సైట్లకు పంపిస్తుంటారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కూడా ఒక సర్వర్‌నే నమ్ముకోకుండా మరో పది సర్వర్లను ముందు జాగ్రత్తగా నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఒకవేళ ఐబొమ్మ మూతపడితే.. ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు మరో 65 వెబ్సైట్లను సిద్ధం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు.