Smita Sabharwal | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.
దివ్యాంగులకు సివిల్ సర్వీస్ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే సామర్థ్యం లేదని తెలిపారు. దివ్యాంగులంటే తనకు అపారమైన గౌరవం ఉన్నదని చెప్పారు. ఏదైనా విమానయాన సంస్థ పైలట్‌గా దివ్యాంగులను నియమిస్తుందా? ఒక దివ్యాంగ సర్జన్ వైద్యం చేస్తానంటే మీరు నమ్ముతారా? ఏఐఎస్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) ఉద్యోగం అంటేనే క్షేత్రస్థాయి పర్యటనలు, గంటలపాటు నిలబడటం, తమ వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సావధానంగా వింటూ ఉండాల్సి ఉంటుంది.
ఇందుకు శారీరకంగా దృఢంగా ఉండాలి. అలాంటి ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు?’ అని ఆమె ప్రశ్నించారు. ఆర్మీ మాదిరిగానే ఏఐఎస్ది కూడా ‘ఫీల్డ్ జాబ్’ అని పేర్కొన్నారు. ఇది తెలివికి సంబంధించిన ఉద్యోగం మాత్రమే కాదని, విరివిగా పర్యటిస్తూ, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ, ప్రజాసమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఉద్యోగ బాధ్యతల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు చెప్పారు.