IAS Officers | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ కేడర్‌కు కేటాయించిన అధికారులు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారులతో పాటు డీవోపీటీ తరఫున వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అంతకు ముందు అధికారుల పిటిషన్లపై హైకోర్టు విచారించగా.. ఐఏఎస్ అధికారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని.. పదేళ్ల అనుభవం పరిగణించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని ఐఏఎస్‌లు వాదించారు.
క్యాట్ తుది తీర్పు వెల్లడించే వరకు తమను రిలీవ్ చేయొద్దని కోరారు. నవంబర్ 4 వరకు రిలీవ్ చేయొద్దని కోరారు. అలాగే, ఐఏఎస్‌లను 15 రోజులు రిలీవ్ చేయొద్దని ఏపీ, తెలంగాణ కోరాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన లేఖలను సైతం హైకోర్టుకు ఐఏఎస్‌లు సమర్పించారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కోర్టులు నిర్ణయించవద్దని.. క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమేనన్నారు. డీవోపీటీ నిర్ణయంపై వివరాలతో క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామని.. అధికారుల పిటిషన్లు కొట్టివేయాలని ఏఎస్జీ కోరారు. కేంద్రం వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కనీసం 15 రోజుల పాటు ఊరట కల్పించాలన్న విజ్ఞప్తిని సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ముందుగా అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని.. సమస్యలేమైనా ఉంటే తర్వాత వింటామని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిసారీ జోక్యం చేసుకుంటే.. సమస్యలు మరింత జఠిలమవుతాయని హైకోర్టు అభిప్రాయపడింది.