Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణకు అనుమతించింది. ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది.
రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వులపై ఇటీవల ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణీ ప్రసాద్, డీ రొనాల్డ్‌రాస్, జీ సృజన, హరికిరణ్, శివశంకర్ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై క్యాట్ సభ్యులు లతా బస్వరాజ్ పట్నే, శాలినీ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16లోగా విధుల్లో చేరాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీంతో క్యాట్ తీర్పును సవాలు చేస్తూ నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు.
క్యాట్‌కు వెళ్లి తప్పు చేశామా?.. పలువురు అధికారుల అంతర్మథనం
డీవోపీటీ ఆదేశాలపై క్యాట్‌ను ఆశ్రయించి తప్పు చేశామా? అని పలువురు అధికారులు భావిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి డీవోపీటీ ఆదేశాల తర్వాత రాజకీయ ప్రక్రియ ద్వారా తమ బదిలీని వాయిదా వేయించాలని అధికారులు భావించారట. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత కొందరు ఐఏఎస్ అధికారులను పిలిచి క్యాట్‌ను ఆశ్రయించాలని సూచించినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకే డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారట. కానీ ఆ నేత మాత్రం ‘రాజకీయంగా ప్రభుత్వ సాయం అందించే పరిస్థితి లేదు. కాబట్టి క్యాట్‌ను ఆశ్రయించండి’ అంటూ ఒత్తిడి చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో అంతర్మథనం చెందుతున్నారట. అనవసరంగా ఆ నేత మాటలు విన్నామని.. క్యాట్‌ను ఆశ్రయించడం ద్వారా డీవోపీటీకి వ్యతిరేకంగా వెళ్తున్నామనే భావన కల్పించినట్టు అయ్యిందని, అవనసరంగా చర్చల్లో నిలిచామని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించినా అనుకూల ఫలితం వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పుకుంటున్నారట. అటు పరువు పోవడంతోపాటు ఇటు ఏపీకి వెళ్లక తప్పడం లేదని వాపోతున్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.