హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కనీసం రెండేండ్లయినా పనిచేసినప్పుడే ఒక ప్రాంతం లేదా శాఖపై ఆ అధికారికి పట్టుకుదిరి పరిపాలన సవ్యంగా సాగుతుంది. ఫలితంగా అక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒకచోట కుదురుకోకముందే మరోచోటుకు బదిలీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యూరోక్రాట్ల కుర్చీ మార్చుతున్నది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో 15సార్లు ఐఏఎస్ బదిలీలు అయినట్టు సమాచారం. ఇందులో కొందరు ఐదు సార్లు బదిలీ, మరికొందరు సగటున రెండు నెలలకోసారి ట్రాన్స్ఫర్ అయిన అధికారులుండటం గమనార్హం. వరుస బదిలీలతో అధికారులు కలవరంతో పాటు ఒకింత అభద్రతాభావానికి గురవుతున్నట్టు తెలుస్తున్నది. తరచూ ఇలా బదిలీలు చేస్తే పాలనపై ఎలా దృష్టిపెట్టగలమని అసహనం వారిలో వ్యక్తమవుతున్నది. ట్రాన్స్ఫర్ చేసిన అటూఇటూ తిప్పుతున్న ప్రభుత్వం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం అదేచోట సేఫ్‌గా ఉంచటం విమర్శలకు తావిస్తున్నది.
దాన కిశోర్, సంజయ్‌లకు మళ్లీ బదిలీ
సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిశోర్‌ను ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు స్థిరత్వం లేకుండా తిప్పుతూనే ఉన్నది. గతంలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్శదరిగా ఉన్న సమయంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ఆయన్ను విపత్తుల నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సరిగ్గా 57 రోజులు తిరగకుండానే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీనికి తోడు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరో సీనియర్ ఐఏఎస్ సంజయ్‌కుమార్‌ను ప్రభుత్వం రాష్ట్రం దాటించింది. హిల్ట్‌పీ పాలసీ రూపకర్తగా చెప్తున్న ఆయన్ను ప్రభుత్వం ఎక్కడా స్థిరంగా పని చేసుకోనివ్వలేదనే ఆరోపణలున్నాయి. మొదట్లో ఆయన్ను పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన బదిలీల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజాగా బదిలీల్లో ఆయన్ను న్యూఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా బదిలీ చేసింది.
ఎస్సీ గురుకుల సొసైటీకి ప్రతి నాలుగు నెలలకో అధికారి
ఎస్సీ గురుకుల సొసైటీకి సగటున ప్రతి నాలుగు నెలలకూ ఒక్క ఐఏఎస్ మారుతున్నారు. ఈ రెండున్నర ఏండ్ల నుంచి సొసైటీకి పర్మినెంట్ అధికారి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నవీన్ నికోలస్‌ను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమించారు. కొద్దిరోజులకే ఆయన్ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అప్పుడే ఉద్యోగోన్నతి పొందిన ఏఐఎస్ అధికారి సీతాలక్ష్మిని కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమెను బదిలీ చేసి అలుగు వర్షిణిని నియమించారు. ‘ఎస్సీ గురుకుల విద్యార్థులు మరుగుదొడ్లు, హాస్టల్ గదులు శుభ్రం చేసుకోవాలి’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం ఆమెను ట్రాన్స్ఫర్ చేసింది. 2025 సెప్టెంబర్‌లో ఎస్ కృష్ణ ఆదిత్యను నియమించారు. నిరుడు ఫిబ్రవరి 28న గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమితులైన విజయేందిర బోయిని నియమించారు. వారం తిరగముందే ఆమె సెలవుపై వెళ్లారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన వారం తర్వాత ఆయన కూడా సెలవుపై వెళ్లారు. కొంతకాలం పాటు ఈ పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీల్లో మళ్లీ విజయేందిర బోయినే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొందరికి తప్పని వరుస బదిలీలు
కృష్ణ ఆదిత్య, అనుదీప్ దురిశెట్టి, దాసరి హరిచందన, ప్రియాంక తదితరులను ఈ రెండున్నరేండ్ల కాలంలో నాలుగు పోస్టింగులు మార్చారు. ములుగు జిల్లా కలెక్టర్‌గా ఉన్న కృష్ట ఆదిత్యను పీసీబీ మెంబర్ కార్యదర్శిగా, అక్కడినుంచి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా, కొంతకాలం కార్మిక శాఖ డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా, అక్కడినుంచి ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా(అదనపు బాధ్యతలు) తాజాగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టిని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 13న ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శిగా, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. సరిగ్గా రెండు నెలలు తిరగకుండానే 2025 జూన్13న ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. తాజా బదిలీల్లో మళ్లీ ఆయన్ను ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. మరో ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నల్లగొండ, నారాయణపేట, హైదరాబాద్‌లకు కలెక్టర్‌గా బదిలీ చేశారు. తాజాగా ఆమెను కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పీ ప్రావిణ్యను ఇప్పటికి నాలుగు సార్లు బదిలీ చేశారు. హనుమకొండ కలెక్టర్‌గా ఉన్న ఆమెను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, 2025 జూన్‌లో సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. తాజాగా బదిలీల్లో ఆమెను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
ఐ అండ్ పీఆర్‌తో సర్కార్ ఆటలు
ఐఅండ్ పీఆర్ శాఖలో సగటున ప్రతి ఆరు నెలలకూ అధికారి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. 2024 డిసెంబర్లో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కోరెం అశోక్‌రెడ్డిని బదిలీ చేసి, ఆయన స్థానంలో హన్మంతరావును తీసుకొచ్చారు. కమిషనర్‌గా హన్మంతరావు పట్టు సాధించకముందే 2024 అక్టోబర్‌లో ఆయన్ను బదిలీ చేసి హరీశ్‌ను ఐఅండ్ పీఆర్ కమిషనర్‌గా నియమించారు. సరిగ్గా ఏడు నెలలు తిరగకముందే 2025 జూన్ 14న ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రియాంకకు అప్పగించారు. తాజా బదిలీల్లో ఆమెను నారాయణపేట కలెక్టర్‌గా బదిలీ చేసి జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డిని ఐఅండ్ పీఆర్ కమిషనర్‌గా నియమించారు. హన్మంతరావు, అశోక్‌రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు బదిలీ చేసింది.
రెండున్నరేండ్లలో బదిలీలు
నాలుగుసార్లు కృష్ణ ఆదిత్య ,అనుదీప్ దురిశెట్టి ,దాసరి హరిచందన ,సీహెచ్ ప్రియాంక
మూడుసార్లు
దాన కిశోర్ ,సంజయ్‌కుమార్ ,హన్మంతరావు ,అశోక్‌రెడ్డి