హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అధికారిక కార్యక్రమమైనా., అతి రహస్యమైనా ఆ ‘అష్టాధికారులనే’ చేరుతుంది. చీమచిటుక్కుమన్నా, ఏ ముచ్చటైనా సరే వారికి ఇట్టే తెలుస్తుంది. అందుకే వాళ్లు ఓ ‘జట్టు’ కట్టారు., ‘ఎనిమిది’ దిక్కుల నుంచి అన్నీ తెలుసుకుంటూ తోటి ఉద్యోగులను తేలిక చేశారు. తమకు అందనంత ‘వేగం’గా సమాచారాన్ని పట్టుకుంటున్న వారి చర్యలతో మిగతా మిత్రులు చిన్నబుచ్చుకుంటుండగా, సచివాలయం మొత్తం ఆ ‘గ్రూపు’ ముచ్చటే., చక్కదిద్దుకుంటున్న ఆ ఐఏఎస్‌ల ఐక్యతవిషయాలే. సచివాలయ కేంద్రంగా ఎనిమిది మంది ఐఏఎస్‌లతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటైంది. సీఎంతో అతి సాన్నిహిత్యంగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి గ్రూపు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సమాచారం ఏదైనా ‘స్పీడ్’గా వాళ్లకే చేరడం, ముఖ్యమంత్రి కార్యక్రమాలు మొదలు, నిధుల విడుదల, ఇతరత్రా విషయాలన్నీ ముందు వీళ్లకే తెలిసిపోవడంపై సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆ ఎనిమిది మంది ఎటు వెళ్లినా, ఏం చేసినా ఒక్కటిగా పనులు చేసుకోవడం, వారికే ప్రత్యేక గ్రూపు ఉండడంపై మిగతా ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తిని మిగులుస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా ఒకరిద్దరు సీనియర్లు వాట్సాప్ గ్రూపు కట్టడంపై పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్న గ్రూపులో సదరు అధికారులంతా సీఎం, ముఖ్యమైన మంత్రులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. మంత్రి ‘ఏ పని అడిగారు.. ఏది చేయాలి.. ఏం చేయవద్దు..’ అన్నది కూడా చర్చించుకుంటున్నట్టు సమాచారం. కాగా, ఆ గ్రూపులో అంతా మంచి చర్చే జరిగితే బాగానే ఉండేదిగానీ, కొందరు పనిగట్టుకుని లాబీయింగ్ కోసమే చేస్తున్న తీరే మిగతావారిలో మరింత కసిని పెంచుతున్నది. అదీకాకుండా ఆ ఎనిమిది మంది అధికారులు దక్షిణ, ఉత్తరాది లాబీలుగా పనిచేస్తున్నారని, తెలుగు ఐఏఎస్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా సర్కార్ పెద్దలతో గ్యాప్ పెంచుతున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
తమకు నచ్చని అధికారులను లక్ష్యంగా చేసుకొని కూడా గ్రూపులో కామెంట్లు పెడుతున్నారని తెలుస్తున్నది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్న వాళ్లు నచ్చని, ఉపయోగపడని విషయాలను మాత్రం బయటకు లీకు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిధుల విడుదల విషయం, సమాచారం షేరింగ్ ముచ్చటపై కూడా వాళ్లే ‘స్పీడ్’ మాట్లాడుకుంటూ, గ్రూపు ‘స్పీడ్’ను మిగతా వారికి సవాల్‌గా మారుస్తున్నారని మరో వర్గం తీవ్రంగా మదనపడుతున్నది. గ్రూపులో తమను చేర్చకుండా తమ సీనియారిటీని అవమానపరుస్తున్నారని మరో వర్గం ఆవేదన వెలిబుచ్చుతుండటం గమనార్హం.
ఒకవైపు సచివాలయంలో కొంతమంది ఐఏఎస్ అధికారుల గ్రూపు రాజకీయం నడుస్తుండగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి, పరిశ్రమల శాఖలోని మరో ఐఏఎస్ అధికారికి మధ్య గొడవ ముదిరిపాకన పడుతున్నది. ఇద్దరూ ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉద్దేశపూర్వకంగా తనను డామేజ్ చేస్తున్నాడని పరిశ్రమల శాఖ కేంద్రంగా పనిచేస్తున్న అధికారి భావిస్తున్నట్టు శాఖ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఇక్కడ వీరిద్దరే కాదు, ఢిల్లీలోని మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇద్దరూ ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్‌గా తనకే అధికారాలుంటాయని ఒకరు వాదిస్తుండగా, ప్రభుత్వం తననే సమన్వయ బాధ్యతలు చూడమన్నదని మరొకరు ముందుంటున్నాడు. ఇలా ఇద్దరి వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారినట్టు సమాచారం.