KTR | రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటానని.. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుపై ధైర్యంగా న్యాయపోరాటం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దయచేసి ఎవరూ ఆగం కావొద్దు. ముఖ్యమంత్రి నోట్లో నుంచి వచ్చేవి వేదవాక్కులువు కావు. సీఎం ఆఫీస్ నుంచి వచ్చేవి లీకులు మాత్రమే భగవద్గీత సూక్తులు కావు. మేం అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే.. సీఎం రేవంత్ పారిపోయిండు. నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రా నాయన అంటే రాలేదు’ అన్నారు.
‘ఇప్పుడు కూడా అడుగుతున్నా. రేవంత్‌రెడ్డి మొగోడివైతే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చపెట్టు. టీవీల్లో లైవ్ పెడితే నేను వస్తా. ఎవరెందో ప్రజలు చూడనివ్వండి. ఆ తర్వాత ఏసీబీని పంపుతవా..? ఈడీని పంపుతవా? ఇంకోటి పంపుతవా? దానికి కూడా హాజరవుతాను. నాకు అభ్యంతరం లేదు. కానీ, నేను తప్పు చేయలేదు. అనాపైస అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తాను. ఉదయం నుంచి మా నాయకులు వందలాది మంది నియోజకవర్గాల నుంచి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. వారందరికీ ఒకటే చెప్పాను. వాటిని పట్టించుకోవద్దని చెప్పాను. వాళ్ల ఇంట్రెస్ట్ ఫార్ములా-ఈ. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేం రైతు భరోసా గురించే మాట్లాడుతాం. డైవర్షన్ కోసం ఏం చేస్తున్నవో మాక తెలుసు. నీకు తెలిసిందే డిస్ట్రక్షన్, డిట్రాక్షన్, డిసెప్షన్ మాత్రమే తెలుసు. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం కాంగ్రెస్ నైజం’ అని ధ్వజమెత్తారు.
‘ఇవాళ రైతులు 70లక్షల మంది రైతులు మాకు రైతు భరోసా అని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ సార్ 12 సార్లు రైతుబంధు ఇచ్చారు. చిట్టినాయుడు ఒకసారి కూడా ఇవ్వలేదు. ఈ సారైనా ఇస్తారా? మాట నిలుపుకుంటడా అని తెలంగాణ రైతులు కండ్లుకాయలు కాసేటట్టుగా చూస్తున్నారు. వాళ్లకు న్యాయం జరిగేందుకు కొట్లాడాలని మా నాయకులకు చెప్పాను. నా గురించి మరిచిపోండి.. న్యాయపోరాటం చేస్తానని చెప్పాను. నేను తప్పు చేయలేదు. ఆయన నన్ను ఏం చేయలేడు. ఆయన ఎన్ని రకాలుగా కక్ష్య సాధింపు ప్రయత్నాలు చేసినా ఏం సాధించలేడు.. శోధించలేడు. మీరు రైతుల సబ్జెక్టుపై మాత్రమే మాట్లాడండి అని ప్రతి నాయకుడికి చెప్పాను. పార్టీ నిర్మాణంపై, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానంపై దృష్టి పెట్టండి అని చెప్పాను. అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో.. ఆ కాంగ్రెస్ పార్టీని, చిట్టినాయుడి పూర్తిస్థాయిలో బండారాన్ని బయటపెట్టి బజారులో ప్రజల ముందు ఎండగట్టండి. ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ.2500, రూ.4వేల పెన్షన్‌పై నిలదీద్దాం.. ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్పా.. పొరపాటు కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడి.. చిట్టినాయుడి లీకులకు ఆగం కావొద్దు’ అన్నారు.
‘చానెల్స్ బాధను అర్థం చేసుకోగలుగుతాను. ప్రతి నిమిషం కొత్తదనం కావాలి. మీ బాధను అర్థం చేసుకుంటాను.. అది మీ తప్పు కాదు. కాకపోతే ఈ కేసు విషయంలో చూపే ఆసక్తిని రైతులు, హైడ్రా బాధితులపై చూపించండి. సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాట్లు.. అప్పుడప్పుడు వాళ్లు చేస్తున్న ఫీట్లు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతలు, గురుకుల పాఠశాల అధ్వాన్న పరిస్థితిపై దృష్టి సారించాలని కోరుతున్నాను. న్యాయపరంగా, చట్టపరంగా భారతపౌరుడిగా.. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును.. రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. అనుముల రాజ్యాంగం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కును విధిగా వాడుకుంటాను. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలో పోతాను. మంత్రులకు ఏం కడుపునొప్పో నాకు అర్థం అవుతలేదు. నాకు భారత న్యాయవ్యవస్థపై ఉంది. వందకు వందశాతం ధర్మం గెలుస్తుంది. నిజం నిలకడమీద తేలుతుంది. నిజం కడప దాటే వరకు.. అబద్దం ఊరంతా తిరుగుతుందని చెబుతారు. పొద్దున నుంచి కాంగ్రెస్ వాళ్ల అబద్ధాలు తిరుగుతున్నయ్. మీడియా నిజానిజాలను చూపించాలి’ అని కోరారు.