MLC Kavitha | తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్దాలు చెబుతున్నారని తెలిపారు.
2004లో చచ్చిన పీనుగులా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. 2004లోనే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పదేళ్లు ప్రజలను ఏడిపించిందని అన్నారు. వందలాది మంది బిడ్డలను పొట్టనపెట్టుకొని తెలంగాణ ఇచ్చారు తప్పా ఉట్టిగా ఇవ్వలేదని అన్నారు. లక్షా 60 వేల కోట్లకుపైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారని తెలిపారు. తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని అంటున్నారని పేర్కొన్నారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 40 వేల కోట్ల విలువైన భూములను 10 వేల కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 10 వేల కోట్లతో రైతు భరోసా, రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు కానీ ఇప్పటికీ 60 శాతం మందికి రుణ మాఫీ కాలేదు, 50 శాతం మందికి రైతు భరోసా రాలేదని పేర్కొన్నారు. మరి ఈ 10 వేల కోట్లు ఎక్కడ పోయినట్లు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు. ప్రస్తుత పాలకులు చూడటానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు… కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక కల్లిబొల్లి మాటలు చెప్పింది.. లేనిపోని హామీ ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.
అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పని చేశారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి అని చెప్పారు.1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకిందని అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ద్రోహి అని విమర్శించారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పారు. అలాంటి ద్రోహులను చాలామందిని చూశామని.. కుట్రలను చూశామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమరపాటుగా ఉంటే కచ్చితంగా తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుందని అన్నారు.