హన్వాడ మార్చి 2 : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోయి యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. హన్వాడ మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన రైతు అంజి ఎకరన్నరలో రూ.20 వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాడు. బోరుబావుల్లో నీటి మట్టం తగ్గి పంట ఎండిపోవడంతో గొర్రెలతో వరి పంటను మేపాడు. అలాగే కొత్తపేట సమీపంలో చెన్నయ్య, సల్లోనిపల్లి సమీపంలో భీమయ్యల ఎకరం చొప్పున వరి పంట ఎండిపోయింది. చేసేదిలేక సదరు రైతులు కూడా గొర్రెలు, మేకలకు మేతగా వదిలివేశారు.