మంచిర్యాల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఆయనో సీనియర్ నాయకుడు.. దాదాపు 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత.. పైగా, పార్టీలో మంచి పోస్టు.. కానీ, ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక విధానాలు, వివక్ష చూసి విసిగి, వేసారి పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీలో విలువలేదని, మనసు చంపుకొని ఆ పార్టీలో ఉండలేనని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజంపై బీజేపీ చిన్నచూపు, వివక్షతో విసిగిపోయానని, రాష్ర్టానికి, జిల్లాకు బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై గేలిచేస్తూ మాట్లాడటం తనకు నచ్చలేదని, ఈ మాటలను బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీకి సదభిప్రాయం లేదని అర్థమయ్యిందని మద్ది శంకర్ తెలిపారు. ‘గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకొన్నారు. కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కేకే 6 గనులను వేలం వేయకుండా సింగరేణికి అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సింగరేణి కార్మికులు కూడా మూడు రోజులు సమ్మె చేశారు. అయినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించింది. ఆ గనులు వేలం వేయడాన్ని కార్మికులతో పాటు తెలంగాణవాడిగా జీర్ణించుకోలేకపోయా’ అని వెల్లడించారు. అదీకాక, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వేధిస్తుండటం తనను కలచివేసిందని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీలో మనసు చంపుకొని ఉండలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆమరణ దీక్ష కూడా చేసిన తాను.. తెలంగాణ సమాజ పతనం ఆశిస్తున్న బీజేపీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. తనతో పాటు బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షుడు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేశ్, పార్టీ పట్టణ కోశాధికారి మురళి, మందమర్రి పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, కెల్లేటి తిరుపతి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మద్ది శంకర్ వివరించారు. ఇన్నేండ్లు తనకు సహకరించిన మిత్రులు, సహచరులు, అనుచరులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలోనూ అందరి సహకారం కావాలని విన్నవించారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ వివక్ష చూపుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ ఇటీవల ప్రధాని తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేకనే అడుగడుగునా విషం కక్కుతున్నారు. విభజన చట్టంలోని హామీలను అటకెక్కించారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుటిల ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్తు సంస్కరణల పేరుతో నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నది. బీజేపీ పతనం ప్రారంభమైంది. నిజ స్వరూపాన్ని తెలుసుకొని పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఇది శుభపరిణామం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే