హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. తాను అన్ని పక్షాల అభ్యర్థిని అని ఇండియా కూటమి ద్వారా బరిలోకి దిగిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయం అనే ముండ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలామంది తనను అడిగారని చెప్పారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించలేదని, ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదని, ఇక ముందు ఉండదని స్పష్టంచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సీఎం రేవంత్‌రెడ్డితో సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 53 ఏండ్లుగా భారత రాజ్యాంగంతో తన ప్రయాణం సాగుతున్నదని, ఇప్పుడు ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు.