పేదలకో నీతి.. పెద్దలకు మరోనీతి.. ఇదే ఇప్పుడు హైడ్రా పాటిస్తున్న ద్వంద్వనీతి. ఉన్నపళంగా సామాన్యుల నివాసాలపై బుల్డోజర్ ఎక్కిస్తున్న అధికారులు.. పెద్దల విషయంలో మాత్రం ‘గడువు’ నాటకం ఆడుతున్నారు. కనీసం సామాను సర్దుకునే సమయం కూడా ఇవ్వని ఆ అధికార గణం.. బడాబాబుల విషయంలో మాత్రం నోటీసులకే పరిమితమవుతున్నది. లక్షలాది రూపాయల డబ్బు పెట్టి కొనుక్కున్న ఎందరో మధ్య తరగతి వారిండ్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారు. కట్టుబట్టలతోనే వారిని బయటకు నెట్టేస్తున్నారు. పాలకపక్ష నేతలకు అనుకూలంగా ఉండేవారి పట్ల మాత్రం హైడ్రా సాచివేత వైఖరిని ప్రదర్శిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా చర్యల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నది. మొదటి నుంచి కూల్చివేతల్లో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. ఎఫ్టీఎల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపులో ‘హైడ్రా’మా కొనసాగుతున్నది. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువులో జరిపిన కూల్చివేతల్లో ముందస్తు నోటీసులు లేకుండా ఉన్నపళంగా సామన్యులు, మధ్య తరగతి వారు ఉండే నివాసాలపై బుల్డోజర్ దింపి రోడ్డుపాలు చేశారు. మరోవైపు టీడీపీ మాజీ ఎంపీ, జయభేరి సంస్థ నిర్వాహకులు మురళీమోహన్ విషయంలో మాత్రం హైడ్రా అడగకుండానే గడువు ఇచ్చింది. అంతేగాకుండా ఎన్ కన్వెన్షన్ తరహాలోనే మురళీమోహన్‌కు సంబంధించిన ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం తెలుగు రాష్ర్టాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్టీఎల్లో అపార్ట్మెంట్లు, షెడ్లు, ఇతర వ్యాపార సముదాయాలను నోటీసులు లేకుండా కూల్చేస్తున్న హైడ్రా.. ఎఫ్టీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించాలంటూ మురళీమోహన్‌కు మాటమాత్రంగా చెప్పి వెళ్లిపోయారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు ఉన్నాయంటూ నోటీసులు లేకుండా ఆదివారం పలు ఇండ్లను కూల్చేశారు. అక్కడ నివాసముండే రోజువారి కూలీలు కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు. మల్లంపేటలోని 13 విల్లాలను కూల్చేశారు. తమ నివాసాలను కూల్చేసిన హైడ్రా.. రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్‌లో ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గత నెల 24న హైడ్రా ఎన్’ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేసింది. దీనిపై దాని నిర్వాహకుడైన నాగార్జున కోర్టును ఆశ్రయించారు.
‘ఎఫ్టీఎల్లో ఉంది.. మీరే కూల్చుకోండి’
నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని సర్వే నెంబర్ 106లోని రంగ్లాల్కుంట ఎఫ్టీఎల్తో కలిపి 5.36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును, ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ మట్టితో నింపి ఎఫ్టీఎల్ స్థలాన్ని కబ్జా చేసి జయభేరి సంస్థ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసింది. దానిని కూడా హైడ్రా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించి ఆ కబ్జాకు గురైన ఎఫ్టీఎల్ స్థలాన్ని కుంటలోకి కలుపాల్సి ఉన్నది. కానీ, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే జయభేరికి నోటీసులు జారీ చేయలేదని హైడ్రా అధికారులు పేర్కొనడం గమనార్హం.
అక్రమ నిర్మాణం కాదు:మురళీమోహన్
తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టి అవకతవకలకు పాల్పడలేదని జయభేరి నిర్వాహకుడు మురళీమోహన్ తెలిపారు. తమకు వచ్చిన నోటీసులపై స్పందించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా తమ షెడ్ల ను తొలగించాల్సిన పనిలేదని, తామే మంగళవారం వాటిని తొలగిస్తామని చెప్పారు.
నాలాలనే మళ్లించారు!
రంగ్లాల్కుంట చెరువు పూర్తిగా కబ్జాకు గురయింది. ఈ చెరువులోకి వచ్చే వరద నీటిని రాకుండా పలు నిర్మాణాలు వెలిశాయి. నాలాలను మళ్లించి చెరువు పక్కనే బడా సంస్థలు అపార్టుమెంట్లనే నిర్మించాయి. నాలాలను మళ్లించి, నిర్మాణాలు చేపట్టి, చెరువు కబ్జాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై అస లు హైడ్రా చర్యలు తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిరాశ్రయులైన వలస కూలీలు
మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమణాలు జరిగాయంటూ హైడ్రా ఆదివారం ఉదయం అక్కడ బుల్డోజర్లతో విరుచుకుపడింది. నివాసాల కూల్చివేతతో కూలీల కుటుంబాలు రోడ్డుపై పడ్డారు. ఆదివారమంతా భోజనంకరువైంది. ఒడిస్సా, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన వారే అక్కడ ఎక్కువగా ఉన్నారు. అయితే అదే జయభేరి కబ్జాలకు 15 రోజుల గడువు ఇచ్చిన హైడ్రా, గుడిసెల్లో నివాసం ఉంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.