హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మూసీ అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లను కూల్చిన అధికారులు, బడాబాబుల ఆక్రమణలోని నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదు. నిరుపేదల బతుకులెంత? అడిగేవారెవరు? అన్న ధీమాతో జేసీబీలు, బుల్డోజర్లతో మూసీ పరీవాహకంలో ఏండ్ల తరబడి ఉన్న ఇండ్లను రెప్పపాటులో కూల్చిపడేశారు. ముందస్తుగా వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించకుండా ఇష్టానుసారం వ్యహరించారు. కానీ అదే నదీ గర్భంలోని బడాబాబుల నివాసాలు మాత్రం హైడ్రాకు కనిపించకపోవడం వెనక మతలబు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మూసీ వరద ఉధృతితో ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో పరీవాహక ప్రాంతాలన్నీ జలమయామయ్యాయి. ఈ పరిస్థితిని పర్యవేక్షించేందుకు హైడ్రా అధికారులు డ్రోన్ల సాయంతో రంగంలోకి దిగారు. ఈ విజువల్స్‌లో నార్సింగిలోని ఓ బడా నిర్మాణ సంస్థ భవనం ఏకంగా నదిలోనే ఉన్నట్టు కనిపిస్తున్నది.
హైడ్రా చిత్రీకరించిన వీడియోల్లో ఆ నిర్మాణం చాలా స్పష్టంగా నీళ్ల ప్రవాహాన్ని ఆపుతున్నట్టుగా కనిపిస్తున్నది. కానీ అధికారులకు మాత్రం ఆ నిర్మాణం అక్రమమని, దానిని తొలగించాలని అనిపించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. ఆ బడా కంపెనీ వెనుక ‘బిగ్ బ్రదర్’ అండ ఉండటంతోనే హైడ్రా అటువైపు కన్నెత్తి చూడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అలాగే, హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతంలోని కొత్వాల్‌గూడ సమీపంలో ఆనంద్ కన్వెన్షన్ పూర్తిగా నీట మునిగింది. ఈ విషయంపై గతంలో ‘నమస్తే తెలంగాణ’ కథనం కూడా ప్రచురించింది. ఈ నిర్మాణం కూడా హైడ్రాకు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాదు హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లోకి నీళ్లు చేరాయి. ఈ నిర్మాణాన్ని కూడా ఎందుకు కూల్చలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పేదోడికి ఒక న్యాయం.. పెద్దోళ్లకు ఒక న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలను బలవంతంగా ఖాళీ చేయించారు. అక్రమ నిర్మాణాలంటూ వారి ఇండ్లను వారి కండ్ల ముందే కూల్చేయించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో మూసీని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సుమారు 175 ఇండ్లను నేలమట్టం చేశారు. మూసానగర్, శంకర్‌నగర్‌లో 150 ఇండ్లను కూల్చిన సర్కార్.. ముసారాంబాగ్‌లో మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న 25 ఇండ్లను నేలమట్టం చేశారు. ఇండ్ల పైకప్పులు తొలగించి గోడలు బద్దలు కొట్టారు. వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పినా చెట్టుకొకరు, పుట్టకొకరులా చెల్లాచెదురయ్యారు. అంతటి భయానక వాతావరణాన్ని సృష్టించింది కేవలం మూసీ సుందరీకరణ కోసమేనని సర్కార్ చెప్పుకున్నది.
అందుకోసం తెలంగాణ మంత్రుల బృందం కోట్ల రూపాయలు వెచ్చించి దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో పర్యటించింది. ఇంతాచేసి ఇప్పుడు మూసీ అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించకుండా ఆ ప్రాజెక్టును అటకెక్కించి పేదోళ్లను రోడ్డున పడేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ వెంబడి రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో రివర్ బెడ్(నదీగర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అధికారులు అంచనా వేసుకున్న 1,595 నిర్మాణాల్లో నిరసనల మధ్య 941 ఇండ్లకు అధికారులు మార్క్ చేశారు. ఇందులో కొన్ని ఆలయ నిర్మాణాలు కూడా ఉన్నాయని సంబంధిత వ్యక్తులు కోర్టుకెళ్లారు. అయితే ఈ లిస్టులో పెద్దోళ్ల నివాసాలు, నిర్మాణాలు మాత్రం మార్క్ చేయకపోవడం గమనార్హం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మూసీ నిర్వాసితులవి. కూల్చివేతల్లో ఇండ్లు కోల్పోయి డబుల్ బె డ్రూం ఇండ్లలోకి బలవంతంగా వచ్చిన కుటుంబాలు 262 మాత్రమే. వీరు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేసిన వారికి రూ.25వేల పారితోషకం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ సాయం అందించలేదని బాధితులు చెప్తున్నారు. వీరి కష్టాలు ఇంకా సలుపుతునే ఉన్నాయి. బడాబాబులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు.
మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్డీసీఎల్) నదికి రెండు వైపుల 2 కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తించింది. ఎఫ్టీఎల్తో పాటు బఫర్‌జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేశారు. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఎస్ఐ)తో అనుసంధానం చేసి ఆక్రమణలు గుర్తించారు. వానకాలంలో మూసీలోకి వచ్చే వరద ఎంత? ఎక్కడి వరకు వరద రానుందో అంచనా చేశారు. 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళికలు రచించారు. అయితే ఇందులో కేవలం పేదోళ్ల ఇండ్లు మాత్రమే అధికారులకు కనిపించి, బడాబాబుల భవంతులు, నిర్మాణాలు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని మేధావులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.