హైదరాబాద్/సిటీబ్యూరో సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. కూల్చివేతల్లో ఉన్న వారంతా పేదలు కాదని, ఆక్రమణలకు పాల్పడిన వారే ఉన్నారని చెప్పారు. చెరువులో ఇండ్లు కట్టుకోవడం ఎవరికీ హక్కుకాదని.. అర్హతలు లేనివారు పర్మిషన్లిస్తే ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తున్నదని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీ అనుమతులు ఉన్నవాటిని కూల్చ డం లేదని, ప్రజలు నివాసం ఉండే ఇండ్లను కూడా కూల్చడం లేదని తెలిపారు. కూల్చివేతలకు సంబంధించి ముందే సమాచారం ఇస్తున్నామని, ఒకవేళ ఖాళీ చేయకుంటే మరింత సమయం ఇస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రాకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. హైడ్రాపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు కనీసం ఎంక్వైరీ చేయడం లేదని, రుణాలు ఇచ్చేముందు బ్యాంకులు కూ డా విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు.
వాటి కూల్చివేతకు నోటీసులు అనవసరం
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, కానీ, తాము పేదలను దృష్టిలో పెట్టుకొని నోటీసులు జారీ చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. కొందరు నిర్లక్ష్యంగా ఉంటూ ఖాళీ చేయడం లేదని, అలాంటి వారికి మళ్లీ సమయం ఇస్తున్నామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ఓనర్‌కు నోటీసులు ఇస్తున్నామని, కానీ వాళ్లు మాత్రం కిరాయి ఉండే వాళ్లకు సమాచారం ఇవ్వడం లేదని వివరించారు.
పర్మిషన్ క్యాన్సిల్ చేసి కూల్చేస్తాం..
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీల నుంచి పర్మిషన్ ఉన్న నిర్మాణాలను కూల్చబోమని చెప్పిన రంగనాథ్.. ఒకవేళ అవి బఫర్, ఎఫ్టీఎల్లో ఉంటే పర్మిషన్ క్యాన్సిల్ చేయిం చి కూల్చివేస్తామని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు కూల్చిన కట్టడాలన్నీ పర్మిషన్ లేనివేనని తెలిపారు. ఒకవేళ ఉన్నా అవి సంవత్సరాల క్రితమే కోర్టుల ద్వారా క్యాన్సిల్ అయ్యాయని, కానీ యజమానులు మాత్రం అనుమతి ఉన్నదనే అనుకుంటున్నారని తెలిపారు.
పెద్దవాళ్లే మా ఫస్ట్ టార్గెట్
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెద్దవాళ్ల కట్టడాలను కూల్చకుండా పేదలవి కూల్చడం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ తమ ప్రథమ టార్గెట్ పెద్దవాళ్లేనని, తాము సైలెంట్‌గా లేమని, గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. ఎప్పుడో ఓసారి కూల్చివేతలు మొదలుపెడతామని చెప్పారు.
జన్వాడ ఫాంహౌస్ మా పరిధిలో లేదు..
జన్వాడ్ ఫాంహౌస్‌ను ఎప్పుడు కూల్చుతున్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. అది తమ పరిధిలో లేదని, జీవో 111 పరిధిలోకి వస్తుందని తెలిపారు.
అకడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూల్చివేత
ఓవైసీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి ఇలా చాలా మంది కాలేజీలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయంటూ తమకు చాలా ఫిర్యాదులు వచ్చినట్టు రంగనాథ్ తెలిపారు. వీటి కూల్చివేతలపై వెనుకంజ వేయలేదని, విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నప్పుడు కాలేజీలను కూల్చితే వేలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, వాళ్లంతా రోడ్లపైకి వస్తారని అందుకే విద్యా సంవత్సరం పూర్తి కాగానే కూల్చివేస్తామని తెలిపారు.
భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య..
బుచ్చమ్మ ఆత్మహత్య చాలా బాధ కలిగించిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాపై జరుగుతున్న ప్రచారంతో భయాందోళనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. కూకట్పల్లి చెరువు పరిధిలో బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, ఇద్దరు కూతుళ్లకు జీ+1 బిల్డింగ్ ఇవ్వగా మరో కూతురుకు ఓపెన్ ప్లాట్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నా వాటి జోలికి హైడ్రా పోలేదని చెప్పారు. హైడ్రా కూల్చివేస్తదంటూ ప్రచారం జరగడంతో భయపడిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నదని, పేదలను భయపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని పేర్కొన్నారు.