సంగారెడ్డి : హైడ్రా కూల్చివేతలు(Hydraa demolitions) మళ్లీ మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్(Aminpur) పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. అలాగే వందనపురి కాలనీలో మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. కాగా, అమీన్పూర్ పెద్ద చెరువును ఆనుకుని ఉన్న పద్మావతి నగర్ లే ఆవుట్..193, 194, 323 సర్వే నెంబర్లలో 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న లే అవుట్ కబ్జాకు గురైందని బాధితులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో చుట్టూ ప్రహరీ నిర్మించారని భాదితులు ఆరోపిస్తున్నారు.
సుమారుగా 2006 నుంచి ఈ అంశం పై పోరాడుతున్నామని తెలిపారు. మొత్తం 294 ప్లాట్స్ తో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లే అవుట్ విషయంపై నాలుగు నెలల క్రితం బాధితులు మొదటగా హైడ్రాను ఆశ్రయించకారు. సర్వే చేసి మూడు నెలల క్రితం చుట్టూ నిర్మించిన గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే కూల్చివేతల తర్వాత కబ్జాదారులు కొద్ది రోజులకే ఐరన్ ఫెన్సింగ్ వేశారు. దీంతో మరోసారి బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా మళ్లీ కూల్చివేతల పనులను చేపట్టింది.