హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తాము సమర్థించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. హైడ్రా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలను ఎంచుకున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకొని స్థలాలు, ఫ్లాట్లు కొనుకున్నారని, వారి కట్టడాలు కూల్చివేసి బజరున పడేస్తే వారు ఎటుపోవాలని ప్రశ్నించారు. తప్పుడు లేఅవుట్లు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి, పెట్టుబడులు పెట్టించి, అక్రమంగా భూములు అమ్మిన వారిని దీనికి బాధ్యులను చేస్తూ కఠినమైన చట్టాలు తీసుకురావాలని సూచించారు.