సూర్యాపేట, సెప్టెంబర్ 27: ’యాభై ఏండ్లుగా ఇక్కడే బతుకుతున్నం.. మా బతుకులు ఆగం చేయకండి’ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల వద్ద సర్వేను నిలిపేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో పేదలం నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసే కుట్రలను ఆపాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని 30, 42, 43వ వార్డుల్లోని వివిధ కాలనీల్లో 50 ఏండ్లుగా సద్దుల చెరువు పక్కన ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే, ఇప్పుడు వాటిని కూల్చివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సద్దుల చెరువు పక్కన మూడు ప్రభుత్వ పాఠశాలలు, పార్కు, కమ్యూనిటీ హాల్, వసతి గృహాలు ఉన్నాయని, వాటినెలా నిర్మించారని ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చేది ప్రభుత్వమే, కూల్చివేసేది ప్రభుత్వమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్వేతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే సర్వేను నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంగిరేకుల రాజశ్రీనాగార్జున, పల్స మహాలక్ష్మీమల్సూర్, కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీరమేశ్, మీర్ అక్బర్, గాలి సాయికుమార్, కట్టు శంకర్, చంచల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.