HYDRAA | శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 : వారంతా పక్కరాష్ర్టాల నుంచి పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కూలీలు. కొన్నేండ్ల కిందట ఓ చోటు చూసుకొని షెడ్లు వేసుకొని తలదాచుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో హౌస్ కీపింగ్ పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా హైడ్రా అధికారులు, భారీ పోలీసుల బందోబస్తుతో వారి రేకుల ఇండ్లపైకి దండెత్తారు. ‘మీ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో ఉన్నాయి’ అంటూ నోటీసులిచ్చి 24 గంటలు గడవకముందే బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. ఎంజరుగుతున్నదో తెలుసుకునేలోపే తమ నీడ నేలమట్టమై కట్టు బట్టలతో నిరుపేదలు రోడ్డున పడ్డారు.
మిగిలిన గోడలు, ధ్వంసమైన సామగ్రిని చూస్తూ గుండెలు బాదుకున్నారు. చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని, తమ బతుకులను ఆగం చేయొద్దని బాధితులు కాళ్లావేళ్లాపడి బతిలాడినా కనికరించకుండా అధికారులు కూల్చివేత కాండను కొనసాగించారు. అదేసమయంలో ఓ చిన్నారి ‘అమ్మా ఆకలి అవుతున్నది.. అన్నం పెట్టు’ అంటూ రోడ్డు పై నుంచే ఏడుస్తున్న తన తల్లిని సైగల ద్వారా కోరడం చూపరులను కలిచివేసింది. తమ పిల్లలకు కనీసం అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వకుండా తమను రోడ్డు పాలు చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడలో మంగళవారం కనిపించిన అమానవీయ దృశ్యాలివి.
కళ్లెదుటే క్షణాల్లో కూల్చివేతలు
ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో సర్వే నంబర్ 18లో ఆక్రమణలు ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు అందాయి. ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి భగీరథమ్మ చెరువును ఆయన పరిశీలించారు. తాజాగా మంగళవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ భగీరథమ్మ చెరువు ప్రాంతానికి బుల్డోజర్లతో చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లోఉన్న దాదాపు 15 రేకుల షెడ్లు, పలు చిరువ్యాపారుల దుకాణాలు, నానక్‌రాంగూడ రోటరీ ప్రదాన రహదారికి అనుకొని ఉన్న రేకుల ప్రహారీ గోడలు, రెండు గదులు, ఓ పశువుల కొట్టాన్ని ఒక్కసారిగా నేలమట్టం చేశారు. ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కూలీల కుటుంబాలు నివాసాలు ఏర్పరుచుకొని జీవిస్తుండగా, మరికొన్ని కుటుంబాలు అద్దెకుంటున్నాయి. ఊహించని పరిణామంతో ఆయా కుటుంబాలన్నీ పిల్లాపాపలతో.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి.
చిన్నపిల్లలున్నా కనికరించలేదు
సామాన్లు తీసుకొని షెడ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరినం. మాకు చిన్న పిల్లలు ఉన్నరని ఎంత బతిలాడినా అధికారులు కనికరించలేదు. బుల్డోజర్లతో ఒక్కసారిగా కూలగొట్టిండ్రు. పోలీసుల బందోబస్తుతో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసి మాగోడు వినకుండా వాళ్ల పని వాళ్లు చేసుకొని పోయిండ్రు. చిన్నపిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డం. ఆకలితో ఉన్న పిల్లలకు ఆన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు.
నోటీసులిచ్చి 24 గంటలు కాలేదు
హైడ్రా అధికారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నోటీసులిచ్చారు. 24 గంటలు కూడా గడవకముందే తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో వచ్చి మా నిర్మాణాలు, ఇండ్లను నేలమట్టం చేశారు. మాది పట్టాభూమి. పాస్‌బుక్‌లు ఉన్నయి. రోడ్డు విస్తరణలో స్థలం పోతే టీడీఆర్ సైతం ఇచ్చారు. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చిన అధికారులు పశువుల కోసం వెసిన షెడ్లు, గదులు, ఇతర నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేశారు.
– కావలి యాదగిరి, నానక్‌రాంగూడ నివాసి
ఉన్నపళంగా రోడ్డున పడేస్తే దిక్కెవరు
నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ బతుకుతున్న మమ్మల్ని ఒక్కసారిగా రోడ్డున పడేసిండ్రు. చిన్నపిల్లలు ఉన్నరు. వంటసామాగ్రితో సహా రోడ్డున పడ్డం. ఇప్పుడు ఎక్కడికి పోవాలె? మాకు దిక్కెవరు? పశ్చిమ బెంగాల్ నుంచి వలసవచ్చి ఇక్కడ బతుకుతున్నం. హౌస్ కీపింగ్ పనులు చేసుకుంట మా మానాన మేం జీవిస్తున్నం. అధికారులు ఇష్టారాజ్యంగా మా నిర్మాణాలు కూల్చివేసి మమ్మల్ని ఆగం చేసిండ్రు.
– షాతి మునోత్ రామ్