ఫొటో నంబర్-1: నిజాంపేట మున్సిపాలిటీ బాచుపల్లిలోని వాసవి అర్బన్ పేరిట చేపట్టిన బహుళ అంతస్థుల నిర్మాణాన్ని హైడ్రా-నీటిపారుదల శాఖ-మున్సిపల్ అధికారులు పరిశీలిస్తున్న చిత్రమిది. 17.34 ఎకరాల్లో 12 టవర్లతో 23 అంతస్థుల చొప్పున నిర్మిస్తున్న ఈ గృహ సముదాయంలోని 8, 9 బ్లాకులు కోమటి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయని అధికారులు తేల్చారు. ఆ మేరకు పదిహేను రోజుల్లో ఆ నిర్మాణాలను తొలగించాలని లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు సదరు వాసవి కంపెనీకి నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసి చాలా రోజులవుతున్నది. హైడ్రా-మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
ఫొటో నంబర్-2: వాసవి అర్బన్ బహుళ అంతస్థుల నిర్మాణంలో 8, 9 బ్లాకులు కోమటికుంట ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నందున సదరు యాజమాన్యం చేసిన ఎన్వోసీ విజ్ఞప్తిని తిరస్కరించినట్టుగా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్ఎండీఏ కమిషనర్‌కు గత నెల 13న రాసిన లేఖ ఇది. గత నెల 2న హైడ్రా అధికారులతో తమ ఇంజినీర్లు కలిసి సైట్‌ను పరిశీలించగా ఎఫ్టీఎల్ పరిధిని పూడ్చివేయడంతో కుంట సామర్థ్యం తగ్గిపోయిందని, పైగా ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణ సామగ్రిని కూడా ఉంచారని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): వాసవి గృహ సముదాయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని హైడ్రాతో కలిసి అధికార యంత్రాంగం తేల్చింది. నోటీసులు ఇచ్చింది. మరి.. సామాన్యుడిపైకి వెళ్లిన బుల్డోజర్ ఈ పెద్దోళ్ల నిర్మాణాల దగ్గరికి పోయేందుకు ఎందుకు జంకుతున్నది? నోటీసులు ఇచ్చినా, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ధారించిన మ్యాపులో చెరువు ఆక్రమణకు గురైనట్టు స్పష్టమవుతున్నా, హైడ్రాను అడ్డుకున్నదెవరు? తెరవెనక జరిగిన రాజీ ప్రయత్నాలేంటి? ఇప్పుడు ఇవే సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. ‘నోటీసులిస్తే మీరు కోర్టుకు పోతారు. స్టే తెచ్చుకుంటారు. అందుకే నోటీసులు ఇవ్వడం లేదు’ అని పేదలకు గడుసుగా జవాబిచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్దోళ్ల వరకు వచ్చేసరికి చక్కగా నోటీసులిచ్చి కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు. దుర్గం చెరువు పరిధిలోని అమర్ సొసైటీలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి స్టే వచ్చే దాకా ఎందుకు వేచి చూశారు? అందుకే పేదోళ్లకే హైడ్రా, పెద్దోళ్లతో హైడ్రామా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగరంలో హైడ్రా సృష్టిస్తున్న బీభత్సం సామాన్యుల్లో వణుకు పుట్టిస్తున్నది. నగరంలో ఒక ఇల్లు ఉండాలనే ఆశ, సామాజిక భద్రతతో లక్షలు వెచ్చించి మరికొన్ని లక్షలు బ్యాంకు రుణాలు తీసుకొని ఇల్లు నిర్మించుకుంటాడు. అలాంటిది హైడ్రా పేరుతో ప్రభుత్వం రాత్రికి రాత్రి వాటిని నేలమట్టం చేయడంతో అనేక కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా ఏర్పాటు కంటే ముందు నుంచి ఇప్పటివరకు ఆ విభాగం 23 చోట్ల ఏకంగా 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇందులో ఒకటీ, అరా మినహాయిస్తే అన్నీ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిర్మాణాలే. ఈ నేపథ్యంలో తాము బడా బాబుల అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేస్తామని, అందుకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల్లో వెల్లడించారు. అయితే, కొన్నిరోజుల కిందట హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయి. కానీ, స్థానిక సంస్థలే అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం, హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేయడం జరిగింది. ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన 23 చోట్ల కూడా సంబంధిత స్థానిక సంస్థలే నోటీసులు జారీ చేశాయి.
ఐదు బడా నిర్మాణ సంస్థలకు నోటీసులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చెప్పినట్టుగానే బడా నిర్మాణ సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసేందుకు కసరత్తు జరుగుతున్నదనేది అక్షర సత్యం. ఐదు బడా నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మితమవుతున్న వాసవి అర్బన్ ప్రాజెక్టుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ అధికారులు ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లి పరిశీలించారు. మరోవైపు హెచ్ఎండీఏ వెబ్సైట్లో కోమటికుంట చెరువు (ఐడీ నంబరు-2822)ను పరిశీలించినా ప్రాజెక్టులోని 8, 9 బ్లాకులు (1732’17.690N-7822’59.602E) ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. బఫర్‌జోన్‌ను పరిగణలోనికి తీసుకుంటే మరికొన్ని బ్లాకులు కూడా అందులోకి వస్తాయి. వాసవితో పాటు అపర్ణ, ఆదిత్య, వర్టెక్స్, జయభేరి నిర్మాణ సంస్థలకు కూడా ఆయా స్థానిక సంస్థలు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కానీ ఈ నాలుగు ప్రాజెక్టుల వద్దకు కూడా ఇప్పటివరకు హైడ్రా వెళ్లలేదు. సంబంధిత అధికారులు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్లి ఎఫ్టీఎల్ మార్కింగ్ కూడా చేయలేదు.
తెర వెనక మతలబు?
హైడ్రా ఏర్పాటు వెనక రేవంత్ ప్రభుత్వానికి రాజకీయ లక్ష్యం ఉందని, నిర్మాణ సంస్థలు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేందుకే దీనిని ఉపయోగించుకుంటున్నారని బీఆర్ఎస్ ఆది నుంచి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థల విషయంలో అదే రుజువైంది. ఈ ఐదు నిర్మాణ సంస్థలకు గత నెల 15-18 తేదీల్లో ఆయా స్థానిక సంస్థలు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అందులో 15 రోజుల గడువు ఇచ్చారు. గడువు ముగిసి 15 రోజులకు పైనే అవుతున్నది. కానీ, ఇప్పటివరకు ఎక్కడా ఒక్క ఇటుక కూడా కూల్చివేసిన దాఖలాలు లేవు. కనీసం ఆయా సంస్థలు హైడ్రాకుగానీ, సంబంధిత స్థానిక సంస్థలకుగానీ వివరణ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అయినప్పటికీ సామాన్యుడి ఇండ్లను కూల్చివేసిన హైడ్రా వీరి జోలికి మాత్రం వెళ్లలేదు. ఇందుకు తెర వెనక జరిగిన మంతనాలే కారణంగా తెలిసింది. ఆయా సంస్థలు ప్రభుత్వ పెద్దలను కలిసి ‘సంతృప్తి’పరచడంతో నోటీసులు అటకెక్కినట్టు చెప్తున్నారు.