‘రేవంత్.. మా ఇల్లేమైనా నీ అయ్యజాగీరా.. అవ్వజాగీరా.. ఒక్కసారి పబ్లిక్‌లోకి వచ్చిచూడు.. చెప్పుతీసుకుని కొడ్తం.. ఐదేండ్లు ఉండిపోయేటోనివి.. మాజోలికెందుకొస్తున్నవ్..!’ ఇది సీఎం రేవంత్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.
Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైడ్రా గోబ్యాక్.. గో బ్యాక్..! సీఎం డౌన్ డౌన్..! సర్వనాశనమైపోతవ్ రేవంత్‌రెడ్డి.. ! ఇవి మూసీ పరివాహక ప్రాం తంలో హోరెత్తిన నినాదాలు. మూసీ పరివాహకకాలనీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా ప్రజల ఆందోళనలు.. హోరెత్తిన నినాదాలతో కాలనీలన్నీ అట్టుడుకిపోయాయి. సర్వే అధికారులపై శుక్రవారం ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. అడుగడుగునా నిరసనలతో సర్వే ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. చైతన్యపురిలో ఓ యువకుడు తన చావే సమస్యకు పరిష్కారమని పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడం కాలనీవాసుల మనోవేదనకు ప్రత్యక్ష నిదర్శనంలా చెప్పాలి. పాతనగరంలో మూసీ రివర్‌బెడ్‌లో ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీని కదిలించినా ప్రతీ ఒక్కరి నుంచి ఒకటే మాట.. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. హైడ్రా గో బ్యాక్. తమ ప్రాంతంలో అడుగుపెడితే ఖబర్దార్ అంటూ అధికారులకు స్థానికులు హెచ్చరికలు జారీ చేసి సర్వే చేయకుండా తరిమికొట్టారు. హైడ్రా సర్వేకు వ్యతిరేకంగా బాధితులు రోడ్డెక్కారు.
రోడ్లపై బైఠాయింపు.. భారీగా ట్రాఫిక్‌జామ్
మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తంగా మారుతోంది. వరుసగా రెండోరోజు ఆందోళనలకు దిగిన స్థానికులు శుక్రవారం నిరసనను తీవ్రతరం చేశారు. వందల మంది రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో పురానాపూల్ నుంచి లంగర్‌హౌజ్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. మరోవైపు లంగర్‌హౌజ్ పిల్లర్ నెంబర్102 వద్ద ఆశంనగర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ వాసులు బైఠాయించారు. దీంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. బడాబాబులను వదిలేసి సామాన్యుల జోలికి వస్తున్న నువ్వు సర్వనాశనమైపోతవ్ రేవంత్‌రెడ్డి అంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడినుంచి వెళ్లేదేలేదని ఖరాఖండిగా చెప్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగేవరకు కదిలేదిలేదని బైఠాయించడంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నంచేశారు. హైదరాబాద్ పాతనగరంలోని కిషన్‌బాగ్, అసద్ బాబానగర్, నందిముసలైగూడ మూసీరివర్బెడ్లోని నివాసితులంతా ర్యాలీగా వచ్చి బహదూర్‌పురా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమ ఇళ్లనుకూల్చవద్దని తమకు డబుల్బెడ్రూం అవసరం లేదని తేల్చిచెప్పారు.
ప్రజల తిరుగుబాటు
మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ఇండ్లపై మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారులపై ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. మూసీ పరివాహక ప్రాంతానికి సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలనడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నించారు. తాము నిర్మించుకున్న ఇండ్ల ఎత్తుకు మూసీ నది నీరు చేరుకున్నట్లయితే దిగువన ఏ గ్రామం మిగలదని.. తమ ఇండ్లను కూల్చి రియల్ ఎస్టేట్ దందా చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ప్రజలు ఆరోపించారు. ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, వ్యతిరేకత ఎదురవ్వడంతో అధికారులు ఆయా ప్రాంతాలనుంచి వెనుదిరిగారు. లంగర్‌హౌజ్‌లో ఏకంగా అధికారులపైకి దాడికి పాల్పడేయత్నం చేయడంతో అధికారులు భయంతో వెళ్లిపోయారు. న్యూమారుతీనగర్ నార్త్ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు వేసిన మార్కింగ్‌లను ప్రజలు తొలగించారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మూసీ పరివాహకంలో పర్యటిస్తున్న అధికారులకు అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు అధికసంఖ్యలో వచ్చి అధికారులతో గొడవలకు దిగుతున్నారు. ఆందోళనకారులు అధికారులపై తిరగబడడంతో సర్వేచేయకుండానే వెనుదిరుగుతున్నారు. అత్తాపూర్‌లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఆ తర్వాత మార్కింగ్ చేస్తామని చెప్పారు. దీంతో మహిళలంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. సర్వే చేయొద్దని రాజేంద్రనగర్ తహసీల్దార్ సిబ్బందిని, మున్సిపల్ అధికారులను మహిళలు హెచ్చరించారు. ‘మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు కూలగొట్టవా.. మా ఇళ్లేమన్నా నీ అయ్య జాగీరా’ అని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. మా ఇళ్లుకూలగొడ్తే మేమెక్కడికి పోవాలని గుండెలవిసేలా రోదించారు. కొత్తపేట, చైతన్యపురిడివిజన్ల పరిధిలోని భవానీనగర్, వినాయక్‌నగర్, ఫణిగిరికాలనీ, సత్యానగర్, న్యూమారుతినగర్ నార్త్ కాలనీలో మూసీ సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డగించారు. మా ఇళ్లు కూల్చొద్దు.. మాకు కరెంట్, వాటర్ సైప్లె ఉన్నయ్.. అన్నిరకాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయ్.. ఇప్పుడెందుకు వచ్చారు అని నిలదీశారు. చైతన్యపురిలో ఓ యువకుడు పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ‘నా భార్య 9నెలల కడుపుతో ఉంది.. మా ఇల్లు కూలగొడ్తే మేము ఎక్కడకుపోవాలి.. పట్టాభూమిలోనే ఇల్లుకట్టుకున్నాం.. కరెంట్ బిల్లు, ఇంటిపన్ను అన్నీ కడుతున్నం అంటూ తన పత్రాలు చూపిస్తూ ఆ యువకుడు ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది.
రాధమ్మ వేదన
ఈమె పేరు రాధ. ఉండేది హైదరాబాద్ చైతన్యపురిలోని కొత్తపేటలో. ఈమె ఇల్లు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉందంటూ అధికారులు శుక్రవారం ఎర్రగుర్తు పెట్టారు. ఇంటిని కూల్చేస్తామని నోటీసులిచ్చారు. ఈమెకు ముగ్గురు ఆడ పిల్లలు. ‘నేను వాళ్ల పెళ్లి చేయాల్సి ఉంది. దయచేసి నన్ను, నా ఇంటిని వదిలేయండి. మీ కాళ్లు పట్టుకుంటా, దండం పెడతా’ అని ఆమె కన్నీరుమున్నీరవుతున్నది. ఆమె గోడు వినేవారెవరు!
30 ఏండ్లుగా ఉంటున్నం
30 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే ఎందుకు పోవాలి. తినో, తినకనో ఉంటూ కొనుకున్న ఇల్లు ఇది. కట్టుకున్నపుడు ఏం చేశారు. మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మమ్మల్ని బలవంతంగా పంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు తగిన శాస్తి జరిగింది మాకు.
– కవిత , న్యూమారుతీనగర్, చైతన్యపురి
నట్టేట ముంచుతున్నరు
ఇరవై ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇద్దరు పిల్లలున్నారు. లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది.. ఖాళీ చేసి వెళ్లమనడం ఎంత వరకు సమంజసం. నా కష్టార్జితమైన ఇంటిని ఎలా వదులుతాం. ప్రజాపాలన అంటూ ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది.
– ఉమా మహేశ్వర్‌రావు,న్యూమారుతీనగర్, చైతన్యపురి
రిజిస్ట్రేషనప్పుడు తెలువదా?
కష్టపడి ఇల్లును కట్టుకున్నాం. ఇంటి రిజిస్ట్రేషన్ చేసేప్పుడు ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలువదా. మా ఇంటికి వంద మీటర్ల దిగువన మూసీ నది ఉంది. ఒక వేళ మా కాలనీలోకి మూసీ నది నీళ్లు వచ్చినట్లయితే దిగువన ఉన్న ఏ గ్రామం మిగులదు. పేదల భూములు గుంజుకుని రియల్ ఎస్టేట్ దందా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు.
– వెంకటేశ్, న్యూమారుతీనగర్, చైతన్యపురి
ప్రాణం పోయినా కదలం
పూల వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య నిండు గర్భిణీ. నా చెల్లండ్లు ఇక్కడే దగ్గర చదువుకుంటున్నారు. అధికారులు ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం.. ఖాళీ చేయమంటే ఎలా? ప్రాణం పోయినా ఇక్కడే ఉంటాం.. ఇల్లు మాత్రం ఖాళీ చేయం.
-మహేశ్ , న్యూమారుతీనగర్, చైతన్యపురి
మమ్మల్ని బతుకనివ్వు రేవంత్
ఇవి అక్రమ నిర్మాణాలు కాదు. కబ్జాలూ కావు. పక్కా పట్టాభూములు. మూసీ సుందరీకరిస్తానంటే దానిపై బ్రిడ్జిలు కట్టుకోమను. మా ఇండ్ల జోలికి రావొద్దు. మా బతుకు మమ్మల్ని బతుకనివ్వు రేవంత్‌రెడ్డి..హైదరాబాద్‌లో ఓట్లు పడలేదని ఇలా చేస్తున్నావా? మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు.
– కుర్మయ్య, మేస్త్రీ, న్యూకమలానగర్,అంబర్‌పేట
ఇదో పెద్ద కుంభకోణం
మూసీ సుందరీకరణ ఒక పెద్ద కుంభకోణం. రేవంత్‌రెడ్డి గరీబోళ్లను రోడ్డున పడేయడానికి చూస్తున్నాడు. సొంతంగా కట్టుకున్న ఇంటిని అక్రమం అంటున్నారు. గరీబోళ్లను ఆగం చేస్తున్నారు. ఇండ్లు కూలుస్తారని భయంతో వణికిపోతున్నారు ఇక్కడి జనాలు. మా పేదల బతుకులను రోడ్లున పడేయొద్దు.
-సంజీవ,తులసీరాంనగర్, గోల్నాక, అంబర్‌పేట