హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో రియల్టీ కారుణ్య మరణాన్ని కోరుకుంటున్నది. సర్కార్ విధ్వంసకర చేష్టలతో ఇన్నాళ్లూ జీవచ్ఛవంలా వెంటిలేటర్‌పై ఉన్న రియల్టీ.. 22ఏ నిషేధిత జాబితాతో ఉన్న కొన ఊపిరి కూడా గాల్లో లిసిపోయింది. మంచాన పడి, కొట్టుమిట్టాడుతున్న రియల్టీకి నిషేధిత జాబితా మరణశాసనం లిఖించింది. మూడేండ్ల కింద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజూ వేలాది రియల్ లావాదేవీలు జరుగతా ఇప్పుడు మూడు జిల్లాల్లో కలిపినా రోజుకు వెయ్యి దాటని రిజిస్ట్రేషన్లను చూసుకొని మురిసిపోయే పరిస్థితి వచ్చింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, స్థానిక పురపాలకవర్గాల నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసి, ఆమోదిందించిన లే అవుట్లను కూడా కాంగ్రెస్ సర్కార్ యూఎల్సీ, 22ఏ జాబితాలో పెట్టి.. నగర రియల్టీని సర్వనాశనం చేసింది. గతంలో ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లను కూడా ఇప్పుడు ప్రభుత్వ భూములు అంటూ సబ్ రిజిస్టార్లు తిరస్కరించేలా చేసింది. నిన్నటిదాకా పన్నులు, ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు దండుకొని అనుమతులిచ్చిన ప్రభుత్వ యంత్రాంగమే.. నేడు అవే ఆస్తులు అక్రమమంటూ నిషేధించడం కొనుగోలుదారులు, రియల్ వ్యాపారులను నిండా ముంచేలా కుట్రలకు తెగబడింది. కష్టార్జితంతో పైసా, పైసా కూడబెట్టుకొని కొనుగోలు చేసిన ఆస్తులు కూడా తమవి కాకుండా పోతున్నాయని బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. సర్కార్ చేసిన కుట్రల ఫలితం తమ పాలిట శాపంలా మారిందనీ, 40 ఏండ్లు గడిచిన తర్వాత యూఎల్‌సీలో తమ ఆస్తులు ఉన్నాయని, రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పడం వెనుక దాగి ఉన్న వసూలు కుట్రనే అని, ఇది హైదరాబాద్ నగరానికి కీలకమైన రియల్ ఎస్టేట్ రంగంపై చావుదెబ్బకొట్టినట్టే అవుతుందనీ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూఎల్సీ భూముల్లో ఇండ్లు, ప్లాట్లు ఉన్నాయనే సాకుతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. వీటికి కలెక్టర్లు ఎన్వోసీలు జారీ చేస్తే గానీ అమ్ముకొనే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి యూఎల్‌సీలో ఉన్న ఆస్తులను విడిచిపించుకొనేందుకు అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం లేకుండా సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం జటిలం చేసింది. అటు రెవెన్యూ, ఇటు సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తమ ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన వివాదానికి పరిష్కారమేదని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాల క్రితమే యూఎల్సీ ఫీజులు చెల్లించి, అనుమతులు పొందిన రికార్డులు ప్రభుత్వం వద్ద దొరక్కపోతే, దానికి ప్రజలను ఎలా బాధ్యులను చేస్తారని మండిపడుతున్నారు.
తెలంగాణలో జరిగే రియల్ లావాదేవీల్లో 70 శాతానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే విస్తరించి ఉంటాయి. గతంలో ఒక్కో జిల్లా నుంచి కోట్లాది రూపాయల రెవెన్యూ రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్ ఖజానాకు వచ్చేది. కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం నిర్వీర్యమైందనే విమర్శలున్నాయి. అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చెరువుల పరిరక్షణ పేరిట తీసుకువచ్చిన హైడ్రా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంలా తగిలింది. పేదల ఇండ్లే లక్ష్యంగా దూసుకువచ్చిన బుల్డోజర్లు సృష్టించిన అలజడితో నగరంలో ఇండ్లు, ప్లాట్లు కొనాలంటేనే జంకుతున్నారు. చివరికి హైడ్రా కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని బ్యాంకింగ్ సంస్థలే చీదరించుకునే పరిస్థితి వచ్చింది. దీంతోపాటు రెండున్నరేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్న రియల్టీపై భూముల ధరలను సవరించి కాంగ్రెస్ సర్కార్ మరో తప్పిదం చేసింది. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా 20-30 శాతం భూముల ధరలను సవరించి మార్కెట్లో లావాదేవీలకు అవకాశం లేకుండా చేసింది. ఈ గాయం మానకముందే.. మూడు జిల్లాల పరిధిలోని 80 శాతం ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి సర్కార్ ఆడిన రాక్షస క్రీడతో బాధిత యజమానులు లబోదిబోమంటున్నారు. నగరంలో విలువైన భూములను చెరబట్టడం కోసమే సర్కార్ ఈ కుట్రలు చేసిందని బాధితులు మండిపడుతున్నారు. నిషేధిత జాబితా నుంచి బయటపడలేక, అవసరానికి ఆస్తులను అమ్ముకోలేక, ఇన్నాళ్లూ తమవేనన్న భరోసాతో ఉన్న భూ యజమానుల ఆశలను నిర్వీర్యం చేసేలా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంపై దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా మారింది.
కాంగ్రెస్ సర్కార్ చేసిన దుశ్చర్యతో రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు, అమ్మకందారులందరూ బాధితులయ్యారు. హైడ్రా కారణంగా కొనేవారు దూరమైతే.. ఇప్పుడు 22 ఏతో అమ్ముకొనే అవకాశమే లేకుండా పోయిందనీ బిల్డర్లు, ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలో తన కూతురు పెళ్లికోసం దాచిన ప్లాట్లను అమ్మకానికి పెట్టిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన వర్ణనాతీతం. తన రెక్కల కష్టంతో 2012లో కొనుగోలు చేసి, ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించి, క్రమబద్ధీకరించుకున్న 180 గజాల ప్లాటును అమ్ముదామంటే యూఎల్‌సీలో ఉన్నదని రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని వాపోయారు. శంషాబాద్ ప్రాంతంలో 12 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో డెవలప్ చేసిన వెంచర్ సరిహద్దును ఆనుకుని ఉన్న సబ్ సర్వే నంబర్లోని యూఎల్సీని కూడా ఈ సర్వే నంబర్‌తో జోడించడంతో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, ఈ వెంచర్లో ప్లాట్లను అమ్మితే గానీ వ్యాపారం కోసం చేసిన అప్పులు కట్టలేని పరిస్థితి నెలకొన్నదని, వడ్డీల భారం పెరుగుతున్నదని, మరోవైపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోలుచేసిన వారు కట్టిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఇదే పరిస్థితి మరో రెండు, మూడు నెలలు కొనసాగితే.. తాము దివాలా తీయాల్సిందేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్‌కు నిజంగా ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే ఉద్దేశమే ఉంటే.. ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చిందనీ, 22ఏ పేరిట వసూళ్లకు తెగబడేందుకు సర్కార్ పెద్దలు అవకాశంగా మార్చుకున్నారనే అభిప్రాయం నిజమేనని భావన కలుగుతున్నదని చెప్తున్నారు.
విస్తారంగా ఉన్న అసైన్డ్, ఇతర రకాల భూములను హస్తగతం చేసుకునేందుకు నిషేధిత జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినా చివరికి రాష్ట్ర ఆర్థిక మూలాలు కూలిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కాకుండా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావాదేవీలు నిలిచిపోవడంతో బ్యాంకుల్లో రుణాల చెల్లింపు, మొండి బకాయిలు పేరుకుపోయే ప్రమాదం ఉన్నదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కూలిన ఆర్థిక మూలాలతో రాష్ట్ర ఖజానాకు వచ్చే అదనపు ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను దివాలా తీసేలా సర్కార్ వ్యవహరిస్తుండటంతో అనాలోచిత ఆంక్షలు, ఆర్థిక సంక్షోభంలో జనాలు చిక్కుకున్నారని చెప్తున్నారు.
కాంగ్రెస్ వదిలిన 22ఏ భూతం నిజంగా నగరవాసుల పాలిట శాపంగానే మారింది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. నిషేధిత జాబితా కారణంగా లక్షలాది మంది భూ యజమాలు తమ ఆస్తులను ఎలా కాపాడుకోవాలోనని తలలు పట్టుకుంటున్నారు. దశాబ్దాల కిందటే అన్ని అధికారిక పత్రాలు, అనుమతులతో కొనుగోలు చేసిన తన ఆస్తి ఉన్నఫలంగా నిషేధిత జాబితాలో పడటంతో అత్యవసరంగా అమ్ముకొనే పరిస్థితి లేకుండా పోయిందని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాధితుడు కన్నీటిపర్యంతమవుతున్నాడు. రెవెన్యూ, ఎస్ఆర్వో కార్యాలయాల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన ప్లాట్ ఉన్న సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే రెవెన్యూ కార్యాలయానికి, అక్కడి అధికారులను కలిస్తే కలెక్టర్ ఇచ్చే ఎన్వోసీ కావాలనీ చెప్తూ చెప్పులు అరిగేలా తిప్పుకొంటున్నారని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నాడు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన భూములను ఇలా నిర్బంధించడం వల్ల తన లాంటి ఎంతోమంది పేద, మధ్యతరగతి ప్రజలను రోడ్డున పడేయడమేనని ఆవేదన వ్యక్తంచేశాడు.
జీవితాంతం కూడబెట్టుకున్న 20 లక్షలు, బ్యాంకు నుంచి రూ. 40 లక్షల లోన్ తెచ్చి రూ.60 లక్షలతో హైదరాబాద్ అమీన్పూర్ సర్వే నంబర్ 1079లో 180 గజాల ఇల్లుకొన్న.. కొనేటప్పుడు సేల్‌డీడ్‌లో 22ఏలో లేదని క్లియర్‌గా రాసి ఉన్నది.. ఇప్పుడు అమ్ముదామంటే 22ఏలో ఉన్నదని రిజిస్ట్రేషన్ చేస్తలేరు. ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్‌కు వాల్యూ లేకుంటే ఎట్ల? మధ్యతరగతి వాళ్లం..ఆశతో బతికేటోళ్లం..బ్యాంకు నుంచి తెచ్చిన లోన్‌కు మిత్తి కడుతున్న. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ కట్టిన. కొన్నవాడు ఇప్పుడు వద్దంటున్నడు. ఇది వివాదంలో ఉన్నదని ప్రచారం చేసిండు. ఇసోంటి ఇల్లును ఎందుకు కొన్నవని నా భార్య తిడుతున్నది. ఇప్పుడు నేనేంజెయ్యాలె?
– శ్రీనివాస్, అమీన్పూర్ (అమీన్పూర్ మండలం)
రాత్రికి రాత్రి నగరంలోని వేలాది ఎకరాల్లో ఉన్న ఆస్తులను సర్కార్ నిషేధించింది. ఉన్నఫలంగా ఉత్తర్వులను ఎత్తివేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. గత జాబితాలో ఉన్న ఆస్తులను కాజేసే కుట్రతోనే ఇతర ఆస్తులను వివాదాస్పదం చేసిందనే అనుమానం ఉన్నది. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలన్నీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేనట్టుగా ఉన్నయి. రెక్కల కష్టంతో కూడబెట్టిన ఆస్తులు.. తమవి కావని తెలిసి ఎంతోమంది భూ యజమానులు మానసిక వేదనకు గురవుతున్నరు. అమ్ముకొనే వీల్లేక వ్యాపారాలను మూసివేసుకొనే పరిస్థితిలో రియల్టర్లు బిక్కుబిక్కుమంటున్నరు.
-నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
మాదాంట్లో 2004లో వెంచర్ వేసిండ్రు. ఇక్కడ 2017లో నేను ఇల్లు కొన్న. సిటీలో నా జాబ్ పోవడంతో ఊరికిపోయి బ్యాంకులో రూ.30 లక్షలు తెచ్చుకొని బిజినెస్ పెట్టుకున్న. ఆ అప్పు తీర్చేందుకు ఇల్లు వేరే వ్యక్తికి అమ్మిన. బ్యాంకు లోన్ ఆయన మీదికి ట్రాన్స్ఫర్ అయింది. నాదీ క్లియర్ అయింది.. రిజిస్ట్రేషన్ కోసం పోతే నీ ఇల్లు 22ఏలో ఉన్నది.. చెయ్యలేమని అధికారులంటున్నరు. 2017లో ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు? ఇప్పుడెందుకు చేస్తలేరని అడిగితే అప్పుడు నేను లేను అని అధికారి తప్పించుకుంటున్నడు. తహసీల్దార్‌కు ఆప్లికేషన్ పెడితే ఆయనకు చేరేందుకే 25 రోజులు పట్టింది. 25 రోజుల తర్వాత తహసీల్దార్‌ను అడిగితే ఇదంతా ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్నదని చెప్పిండు. కొన్న అతడి శాలరీ నుంచి ఈఎంఐ కట్ అవుతున్నది. కానీ ఆయన పేరిట రిజిస్ట్రేషన్ అయితలేదు.
– రాజేశ్‌కుమార్, (అమీన్పూర్)
మేం 1995లో హుడా లేవుట్తో 9 ఎకరాల్లో రెండు వెంచర్లు వేసినం. ఇప్పుడు సంగారెడ్డిలోని 337 సర్వే నంబర్‌ను 22ఏలో పెట్టిండ్రు. 52/1, 52/2 గతంలోనే నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. దీనిపై సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఒడిపోయింది. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్తె మా వినతిని చెత్తబుట్టలో పడేసిండు. 22ఏ నుంచి తీసేయమంటే ముఖ్యమంత్రి, మంత్రి మనుషులు కమీషన్లు అడుగుతున్నరు.
– దేవేందర్‌రావు, హెచ్ఎండీ, స్వర్ణపురి కాలనీ