HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలపై దృష్టిపెట్టింది. కొంతమందికి నోటీసులిస్తున్న హైడ్రా మరికొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు దిగుతున్నది. ఫిల్మ్‌నగర్‌లోని మహిళామండలి భవన్‌కు రోడ్డును ఆక్రమించారంటూ రెండుసార్లు నోటీసులిచ్చి ఆపై కూల్చివేసింది.
నాగారంలో కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఇంటి యజమాని పాపిరెడ్డి చెప్పారు. గతంలో శాఖల ద్వారా నోటీసులు జారీ చేసేవారు కాగా.. ఆర్డినెన్స్ వచ్చిన తరవాత హైడ్రా నేరుగా నోటీసులు ఇస్తున్నది. రాజ్సుఖ్నగర్లో బుధవారం రెండు బృందాలుగా విడిపోయిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. జేసీబీలతో వచ్చిన హైడ్రా బృందాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆక్రమణలను మాత్రమే తొలగిస్తాం.. ఇతర ఇండ్ల జోలికి రామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానికులు నమ్మడం లేదు. బతుకమ్మ కుంట వద్ద హైడ్రా అధిపతి రంగనాథ్ మాట్లాడుతూ నోటీసులిచ్చే అధికారం తమకు ఆర్డినెన్స్ ద్వారా వచ్చిందని, ఆక్రమణదారులకు నోటీసులు వెళ్తూనే ఉంటాయని చెప్పారు.
కూల్చివేతలకు మధ్యలో బ్రేక్ ఇచ్చిన హైడ్రా బెంగళూరు పర్యటన తర్వాత మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పటివరకు సుమారు ఇరవై మందికి పైగా హైడ్రా నోటీసులిచ్చినట్టు తెలిసింది. వీరందరికీ వారం రోజులు మొదట ఆ తర్వాత పదిహేనురోజుల గడువుతో కూల్చివేతలకు దిగుతున్నది. నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత న్యాయబృందంతో చర్చించి ఒకట్రెండు రోజుల్లోనే కూల్చివేతలకు దిగుతున్నారు. కొన్నిచోట్ల అసలు నోటీసులే ఇవ్వకుండా స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేస్తున్నారు. రోడ్ల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రాకు గత రెండునెలలుగా అనేక ఫిర్యాదులు అందాయి. వీటిపై క్షేత్రస్థాయి విచారణ జరిపేందుకు హైడ్రాబృందం ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నది. ఈ వారంలో ఇప్పటికే నాలుగుచోట్ల ఆక్రమణలంటూ కూల్చివేతలకు దిగిన హైడ్రా బృందం వచ్చే వారం రోజుల్లో మరో పది ప్రదేశాలకు జేసీబీలను పంపనున్నట్టు తెలిసింది.