హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని (Gajularamaram) బస్తీపై ఈ నెల 21నాటి ఉదయం హైడ్రా (HYDRAA) అధికారులు విరుచుకుపడ్డరు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాల్లో తొలిరోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు. పేదల ఆర్తనాదాల మధ్య గంటల్లోనే ఇండ్లను కూల్చిపారేశారు. అప్పటినుంచీ ఆ బస్తీవాసులు ఆ శిథిలాల మధ్యే తిరుగాడుతున్నారు. కండ్లముందు కలలు కూలిపోతే.. కాదు, సర్కారు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే.. ఏ నీడన తలదాచుకోవాలో తెలియని ఆవేదన వారిది. అదే శిథిలాల మధ్య నిలబడి ఇప్పటికీ గూడు చెదిరిన ఆ గుండెలు చేస్తున్న ఆక్రందనలు వింటే కడుపు తరుక్కుపోతున్నది. కండ్ల వెంబడి నీళ్లు కారుతున్నయ్. అదే శిథిలాల మధ్య నిలబడి పన్నెండేండ్ల ‘రేపటి పౌరుడు’ మాట్లాడిన మాటలు హృదయవిదారకంగా ఉన్నయ్.
ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. న్యూస్‌లైన్ యూట్యూబ్ చానల్ ప్రతినిధి తనను కదిలించినప్పుడు, బాలుడు మాట్లాడిన మాటలు.. హైడ్రా అనర్థాన్ని, సర్కారు ఇనుప పదఘట్టనల కింద పడి నలుగుతున్న పేద బతుకులను కండ్లకు కట్టాయి. ‘ఇప్పుడు మేం ఎక్కడుండాలె? ఎట్ల బతకాలె?’ అంటూ సర్కారుకు, సమాజానికి సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చేదెవరు? వీడియోలో బాలుడి మనోవేదన అతడి మాటల్లోనే .. ‘బతుకమ్మ పండుగకని స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చిండ్రు. కరెక్టుగా బతుకమ్మ పండుగ రోజే వీళ్లొచ్చిండ్రు. మా ఇల్లు కూలగొట్టిండ్రు. మా నాన్నను గుంజి పడేసి నడుము విరగ్గొట్టిండ్రు.
మేము ఆడుకోవాల్నా.. ఇది జూడాల్నా?.. ఇప్పుడు మా బతుకు రోడ్డుమీద పడింది. తిననీకి తిండి లేదు. తాగేటందుకు నీళ్లు లేవు. స్నానం చేసేందుకు కూడా సుక్క నీళ్లు లేవు. మేము యాడ పండుకోవాలె?. యాడ బతకాలె? బతుకమ్మ చీరలిస్తనన్నరు. వాళ్లనే కట్టుకోమనుండ్రి. ఇల్లు కూలగొట్టినంక చీరలెందుకు?.. మేము సచ్చినంక ఆ చీరలియ్యమనుండ్రి. రోడ్డుమీదపడ్డది మా బతుకు. వాళ్లిండ్లల్ల మమ్మల్ని పడుకోనిస్తరేమో అడగండి’ అని ప్రభుత్వంపై ఆ పసివాడు గుడ్లనిండా నీళ్లు తెచ్చుకొని తన ఆవేదనను వ్యక్తంచేశాడు. తమను ఈ గతి చేసిన పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాడు. తమ బతుకులు ఏం కావాలని నిలదీశాడు. పెద్దోళ్లను వదిలి.. పేదోళ్లను తరిమే హైడ్రా వద్ద దీనికి సమాధానమున్నదా? గరీబీ హఠావోను గరీబోంకో హఠావోగా మార్చిన కాంగ్రెస్ సర్కారు జవాబు చెప్పగలదా?