సంగారెడ్డి: జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచేప్పింది. మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ, కిష్టారెడ్డిపేటలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో కిష్టారెడ్డిపేటలోని 164వ సర్వేనంబర్‌లోని ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. అదేవిధంగా పటేల్‌గూడలోని 12వ సర్వేనంబర్‌లో 12 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు.
కాగా, కూల్చివేతల సమయంలో స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో పోలీసులు అందరినీ ఆపేశారు. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో హైడ్రా అధికారులు, పోలీసులు భారీగా మోహరించారు.
కాగా, కూకట్‌పల్లిలోని నల్లచెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఉన్నట్లు తేలింది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
అయితే కూల్చివేతలపై స్థానికులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలతో తమ బతులు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ రోధిస్తున్నారు.