HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నివాసయోగ్యమైన నిర్మాణాలను కూల్చివేయడం ఇక జరగదు. వాటికి అనుమతులు లేనప్పటికీ కూల్చివేయబోము. రేపు ఎక్కడైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లు కూలుస్తారంటూ తప్పుడు సమాచారం వచ్చినా అదంతా అబద్ధమని భావించాలి. చెరువును పునరుద్ధరించేటప్పుడు ఎంతవరకు చేయగలుగుతాం అనేది చూస్తాం. ఉదాహరణకు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వాస్తవంగా 16 ఎకరాల వరకు ఉండాలి. కానీ ఇప్పుడు ఐదెకరాలే మిగిలింది. మిగిలిన 10-11 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అందులో చాలా బస్తీలు వచ్చినయి. వాటిని తొలగిస్తామని మేం అనడం లేదు కదా. వాటిని టచ్ చేయం. ఎప్పటినుంచో ఉన్న సమస్యకు ఇప్పుడు ఒకేరోజు పరిష్కారం వస్తుందని ఆశించడం కూడా కరెక్టు కాదు. అందుకే ఇక ముందు సమస్య రాకుండా చూస్తాం..’ ఇదీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన ప్రకటన.
మారిన వైఖరి దేనికి సంకేతం
నోటీసులిస్తే కోర్టుకు వెళతారు.. అందుకే నోటీసులివ్వకుండానే కూల్చివేస్తం అన్న హెచ్చరికల నుంచి అనుమతులు లేని నిర్మాణాల జోలికి సైతం వెళ్లమనే ప్రకటన దేనికి సంకేతమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జంట జలాశయాల్లో భాగమైన హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ను పునః పరిశీలించి..ఆక్రమణలను నిర్ధారించే ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉన్నది. ఈ తరుణంలో కమిషనర్ హైడ్రా రంగనాథ్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులను చెరబడితే చెరసాలనే!! అని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పలు సమావేశాల్లో ప్రకటించిన నేపథ్యంలో.. జంట జలాశయాల పరిధిలోని పెద్దల ఫాంహౌస్లపై హైడ్రా, రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదనే ఆసక్తి ఇప్పటికీ సామాన్యుల్లో ఉంది. ముఖ్యంగా గత ఐదు నెలల్లో సుమారు 4.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఒక్క రాజకీయ, లేక అధికార పార్టీ ప్రముఖుడి అక్రమ నిర్మాణాన్ని తాకలేదు. ఇప్పుడు యూటర్న్ వెనుక మర్మమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికి 4.65 లక్షల చదరపు అడుగుల్లో కూల్చివేతలు
హైడ్రా ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో అనేక నిర్మాణాలను కూల్చివేసింది. సున్నం చెరువు, కత్వా చెరువు, నల్లచెరువు, అప్పా చెరువు, ఎర్రగుంట చెరువు, అమీన్పూర్ చెరువు, తుమ్మిడికుంట ఇలా పలు చెరువులతోపాటు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ చిలుకూరు, హిమాయత్‌నగర్, అప్పోజిగూడ ప్రాంతాల్లో వందల నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇందులో ఒకటీ, రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ సామాన్యుల నివాసాలే. వీటిల్లో అనేకం గతంలో ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చినవి కూడా ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల పరిమాణాన్ని లెక్కిస్తే దాదాపు 4.65 లక్షల చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.2వేల వరకు ఖర్చు అవుతుందనుకుంటే.. హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల విలువ రూ.100 కోట్ల పైమాటే! ఈ లెక్కింపు కాస్త విడ్డూరంగానే ఉండొచ్చుగానీ… పైసాపైసా కూడబెట్టుకొని, బ్యాంకు రుణాలు తీసుకొని, సొంత ఊర్లో వ్యవసాయ భూములు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసినప్పుడు ఆ సామాన్యుడు అనుభవించిన వ్యథ ఈ వ్యయం ముందు దిగుదుడుపే. బుల్డోజర్లతో కూల్చివేసిన నిర్మాణాలకు ఆ యజమానులు నష్టపరిహారం అడిగే హక్కు ఉందనే హైకోర్టు అమూల్యమైన భరోసా బాధతుల్లో ఆశలు రేకెత్తించవచ్చు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్యుడు ఆ భరోసాను సాకారం చేసుకోవడమనేది ఎంత ‘వ్యయ’ప్రయాసలతో కూడుకున్నదో ఊహించవచ్చు.
సాంత్వన సరే.. వేదన మాటేమిటి?!
హైడ్రా కమిషనర్ రంగనాధ్ శుక్రవారం చెరువుల పరిరక్షణపై నిర్వహించిన సదస్సులో చేసిన వ్యాఖ్యలు లక్షల మంది గృహ యజమానులకు సాంత్వన చేకూర్చేలా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఐదు నెలలుగా బుల్డోజర్లతో తరిమి.. ఇప్పుడు సాంత్వన చేకూర్చే వ్యాఖ్యలు చేస్తే మరి గత ఐదు నెలలుగా వాళ్లు అనుభవించిన మనోవేదన మాటేమిటి? ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ‘ఎప్పటినుంచో వస్తున్న సమస్యకు ఒకేరోజు పరిష్కారాన్ని ఆశించడం కరెక్టు కాదు’ అని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఐదు నెలల క్రితం హైడ్రా బుల్డోజర్లు దూకుడు ప్రదర్శించిన సమయంలో బీఆర్ఎస్తో పాటు ‘నమస్తే తెలంగాణ’ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా వెలిసిన నిర్మాణాలకు ఇప్పటికిప్పుడు బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ వందల నిర్మాణాలను కూల్చివేసి, వందల కుటుంబాల్లో వేదన మిగిల్చారు.
ఫాంహౌస్‌ల చుట్టూ రక్షణ వలయమేనా?!
శనివారం ఉదయం సుమారు పది గంటల సమయంలో హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పునః పరిశీలన, నిర్ధారణ ప్రక్రియ మొదలు కానున్నట్టు తెలిసింది. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఈ సంయుక్త సర్వేకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ ఇతర షెడ్యూల్ దరిమిలా రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ తర్వాత ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పరిధిలో కూడా ఎఫ్టీఎల్ పునఃపరిశీలన, నిర్ధారణ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలు… పదేపదే సీఎం రేవంత్‌రెడ్డి జంట జలాశయాల పరిధుల్లోని ఫాంహౌస్లపై చేసిన వ్యాఖ్యలతో పలువురు రాజకీయ ప్రముఖుల నిర్మాణాలు తెరపైకి వచ్చాయి.
వాటిలో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుల గృహాలు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, అధికార పార్టీ ఎంపీ భాగస్వామ్యం ఉన్న విద్యా సంస్థ నిర్మాణ సముదాయాలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పల్లంరాజు, కేవీపీతో పాటు ఇతర రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల ఫాంహౌస్‌ల అంశం చర్చలోకి వచ్చింది. వీరిలో కొందరు తమది ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉంటే కూల్చేసుకోండి! అని కూడా ప్రకటనలు చేశారు. తీరా.. జలమండలి సర్వే నివేదికలోనే వీరి పేర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎఫ్టీఎల్లోని నిర్మాణాలను కూల్చివేయబోమని ప్రకటించడంతో ఈ ప్రముఖుల ఫాంహౌస్‌లకు ఇక ప్రమాదేమేమీ లేదనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. పేదోళ్లకు ఒక నీతి, పెద్దోళ్లకు ఒక రీతి! అనే సందేహం అందరిలోనూ ఉంది. ‘ఇప్పటివరకు హైడ్రా సామాన్యుల నిర్మాణాలను మాత్రమే కూల్చింది. హైరైజ్ బిల్డింగ్స్ (ఆకాశహర్మ్యాలు) జోలికి మాత్రం ఎందుకు వెళ్లలేదు?’ అంటూ ఒక రిటైర్డ్ ఇంజినీర్ రంగనాథ్‌ను సూటిగా ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం.