Ranganath | రామచంద్రాపురం, నవంబర్ 27: ఆక్రమణలను ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట చెరువులను పరిశీలించారు. చెరువుల పరిసరాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలపై ఆరా తీశారు. మేళ్ల చెరువులో మట్టిని నింపి ఆక్రమణకు పాల్పడిన రాజుయాదవ్‌ను హైడ్రా కమిషనర్ ప్రశ్నించగా ఇది తమ పట్టా పొలమని, తమకు గతంలోనే అధికారులు ఎన్వోసీలు ఇచ్చినట్టు చెప్పాడు. గతంలో ఇచ్చిన ఎన్వోసీలను రద్దు చేసినట్టు కమిషనర్ తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించాలని ఆదేశించారు. తెల్లాపూర్ సాగునీటి సంఘం మాజీ చైర్మన్ వడ్డె నర్సింహులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువుల స్థితిగతులను వివరించారు.
ఆయా చెరువుల ఆక్రమణలపై గతంలోనే హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పత్రాలను కూడా అందజేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల జాబితాలో తెల్లాపూర్‌కు సంబంధించిన చెరువుల వివరాలు లేవని ఆయన హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని రంగనాథ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎఫ్టీఎల్ హద్దులను నిర్ణయిస్తున్నట్టు ఇరిగేషన్ డీఈ రామస్వామి తెలిపారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని రంగనాథ్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో జరిగిన ఆక్రమణలపై పరిశీలించి తొలిగిస్తామని చెప్పారు. హైడ్రా కమిషనర్ ఆకస్మిక పర్యటనతో స్థానికంగా చర్చనీయాంశం కాగా బిల్డర్లల్లో గుబులు మొదలైంది.