హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో సమగ్రసర్వేకు ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన సమావేశంలో హైడ్రా అధికారుల బృందం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల వివరాలు, ఇతర అంశాలపై సర్వే అధికారులతో చర్చించారు. 1971-72 సర్వే ప్రకారం నగరంలో ఉన్న చెరువులు, వాటి విస్తీర్ణంతోపాటు ప్రస్తుత పరిస్థితి అంశాలపై మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీదా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను హైడ్రా బృందానికి చూపించారు. యాభై ఏండ్ల క్రితం నగరంలో ఉన్న చెరువుల పరిస్థితిపై ఆనాటి మ్యాపులతోపాటు నేటి పరిస్థితిని పోలుస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాను సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవడానికి ప్రస్తుతం హైడ్రా కసరత్తు ప్రారంభించింది.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు నిర్ధారించడంలో సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కోరారు. దీనికి తమ దగ్గర సిబ్బంది కొరత ఉన్నట్టుగా అధికారులు చెప్పినట్టు తెలిసింది. తమ బృందం పనిచేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తితే సర్వేపరంగా సహకారం అందించాలని కమిషనర్ సర్వే అధికారులను కోరినట్టు సమాచారం. మరోవైపు సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదిక తయారు చేయనున్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించి.. ప్రాధాన్యక్రమంలో చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు.