కాశీబుగ్గ, సెప్టెంబర్ 24: గ్రేటర్ వరంగల్‌కు త్వరలోనే హైడ్రావస్తుందని, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. బుధవారం వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో రావణవధకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం అక్రమ నిర్మాణాలతో కుదించుకుపోయిందని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఏర్పడి అక్రమ నిర్మాణాలు తొలగించినట్లుగానే వరంగల్లోనూ త్వరలో కార్యాచరణ ఉంటుందని తెలిపారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల ఇండ్లకు రక్షణ కల్పించి అక్రమార్కుల నిర్మాణాలు తొలగిస్తామని తెలిపారు.
హైడ్రాకు 69 కోట్లు విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు రూ.69 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.