హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భిన్నవాతావరణం కొనసాగుతున్నది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడిగాలులు, సాయంత్రం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెలాఖరు వరకు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నదని.. ప్రధానంగా సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరో మూడు రోజులపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.