సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జలమండలిలో రెవెన్యూ విభాగం అస్తవ్యస్తంగా మారింది. రెవెన్యూ విభాగం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజీఎం/డైరెక్టర్ అనాలోచిత నిర్ణయాల వల్ల జలమండలి అభాసుపాలవుతున్నది. జలమండలికి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో రెవెన్యూ విభాగాన్ని జేఎండీకి ప్రత్యేకంగా నిర్వహించేలా అప్పగించారు. ప్రాజెక్ట్స్ విభాగం నుంచి అధికారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి డైరెక్టర్గా నియమించారు. అయినా గడిచిన మూడేండ్లుగా జలమండలికి ఆదాయం పెరగకపోగా ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల మీటర్ రీడర్ల ఆందోళనకు ప్రధాన కారణం రెవెన్యూ విభాగమేననే ఆరోపణలు వస్తున్నాయి.
మీటర్ రీడర్ల సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ డైరెక్టర్ మీనమేషాలు లెక్కించడం వల్లే పరిస్థితి అదుపు తప్పినట్లు జలమండలిలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. వారి సమస్యలపై పలుమార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా చూసీచూడనట్లు వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది. ఈనేపథ్యంలో మీటర్ రీడర్లు ఆందోళన ఉద్ధృతం చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. జేఎండీ కూడా ఈ అంశంపై పూర్తిస్థాయిలో సమీక్షించకపోవడంతో మీటర్ రీడర్ల ఆందోళన తీవ్రతరం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో మీటర్ రీడర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఉపాధి కోల్పోతామేమోననే ఆందోళనతో ఇద్దరు కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. సమస్యను పరిష్కరించేందుకు ముందే ప్రయత్నించి, దిద్దుబాటు చర్యలు చేపడితే ఇద్దరు ప్రాణాలు దక్కేవనే చర్చ జలమండలిలో జోరుగా జరుగుతున్నది.
అడుగడుగునా నిర్లక్ష్యం
మీటర్ రీడర్లతో పాటు రెవెన్యూ విభాగంపై ప్రస్తుత డైరెక్టర్ అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. గతంలో సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి, జలమండలికి రూ.100 కోట్ల నష్టం వాటిల్లడానికి ఆయన నిర్లక్ష్యమే కారణమని జలమండలి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీటర్ రీడర్ల వ్యవహారంలోనూ వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి ప్రతిదానికి చిన్న విషయాన్ని జేఎండీకి పంపుతూ చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాత ఈఎండీలు విడుదల చేయకుండా ఏజెన్సీలను సతాయించడంతో వారిలోనూ అసంతృప్తి ఏర్పడింది. ఏజెన్సీలను రెండేండ్లుగా రెన్యూవల్ చేయకుండా పొడిగిస్తూ రావడంతో జీతాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది.
ఈ వ్యవహారంపై జేఎండీ సైతం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. సీజీఎం, డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నా ఆయన స్థాయిలో సరిష్కరించాల్సిన ఫైళ్లు కూడా జేఎండీకి పంపడం.. ఆయన తిరిగి పంపించడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈనేపథ్యంలో పనులన్నీ ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అటు మీటర్ రీడర్లు జీతాల విడుదల, ఉద్యోగ భద్రతపై పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యం చేయడంతో జలమండలి అభాసుపాలు కావాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకుండా జలమండలి రెవెన్యూ విభాగంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. పనుల్లో నిర్లక్ష్యాన్ని వీడి జలమండలికి ఆదాయం సమకూర్చే దిశగా పనిచేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.