హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదు. హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్-65) రహదారి విస్తరణ పనులకు కేంద్రం ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గడ్కరీతో తమకున్న పరిచయం ద్వారా త్వరలో విస్తరణ ప్రారంభిస్తామని ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ఎన్‌హెచ్-65ని రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. అప్పట్లో ఎన్హెచ్ఏఐకి, కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌కు కుదిరిన ఒప్పందం ప్రకారం రహదారిని దశలవారీగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉన్నది. కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తమకు టోల్‌ట్యాక్స్ ఆదాయం తగ్గిపోయిందని పేర్కొంటూ జీఎంఆర్ సంస్థ ఆరు లేన్లకు విస్తరించకుండా పనులు నిలిపివేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టోల్‌ట్యాక్స్ మాత్రం యథావిధిగా వసూలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఆ కాంట్రాక్టును రద్దు చేసి టోల్ వసూళ్లు ఎన్హెచ్ఏఐకి అప్పగించింది. అలాగే పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా 229 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు డీపీఆర్ గతంలోనే ఎన్హెచ్ఏఐ వద్ద సిద్ధంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులతో దాన్ని కేంద్రానికి పంపింది. చౌటుప్పల్, చిట్యాల్లలో జంక్షన్లను రీ డిజైన్ చేయగా ఎల్బీనగర్-హయత్‌నగర్ మధ్య సుమారు 5.5కి.మీ.ల మేర ఎనిమిది లేన్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. డీపీఆర్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించాక టెండర్ల ప్రక్రియ మొదలయ్యే వీలున్నది. అయితే, మంత్రి కోమటిరెడ్డి వెంటనే కేంద్రం నుంచి అనుమతులు తెస్తామని, సాధ్యమైనంత తొందరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా ఇప్పటికీ డీపీఆర్‌కు కూడా అనుమతులు లభించలేదు. ఫలితంగా పనులు మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశమున్నది.
రహదారి విస్తరణ కోసం భూసేకరణ చేయాల్సి ఉండగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 9 గ్రామాలు, నల్లగొండలో చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లో చెరి ఐదు గ్రామాలు, కట్టంగూర్ మండలంలోని నాలుగు గ్రామాలు, నకిరేకల్‌లో రెండు గ్రామాలు, కేతేపల్లిలో నాలుగు గ్రామాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో నాలుగు గ్రామాలు, చివ్వెంల మండలంలో ఆరు, కోదాడలో నాలుగు, మునగాలలో ఐదు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉన్నదని గుర్తించారు. రైతులు ఒప్పుకోని కారణంగా భూసేకరణ ఇప్పట్లో సాధ్యంకాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రహదారిని అత్యాధునిక హై-సెక్యూరిటీ స్మార్ట్ హైవేగా నిర్మించేందుకు రూ.10,391.53 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఇదికాకుండా ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్స్పాట్లను గుర్తించిన ఎన్హెచ్ఏఐ రూ.325కోట్లతో రోడ్డు విస్తరణ, అండర్‌పాస్‌లు, సబ్‌వేలు, ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించింది. దాదాపు ఏడాది దాటుతున్నా ఇంకా పది శాతం కూడా పనులు మొదలుకాలేదు. దాదాపు 70శాతం పనులు మొదలు కావాల్సివుంది. ఈ పనులు ఎలాగూ ఇప్పట్లో అయ్యేలా లేకపోవడంతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ప్రభు త్వం రోడ్లపై గుంతల పూడ్చివేత, మరమ్మతు పనులు చేపట్టింది. మొత్తమ్మీద రోడ్డు విస్తరణ, బ్లాక్స్పాట్ల అభివృద్ధి పనులు ఎప్పటికి పూర్తవుతాయో రానున్న కాలమే నిర్ణయించాలి.