హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశంలో నిర్వహిస్తున్న జీ-20 సమావేశాల్లో తెలంగాణకు మరో అరుదైన అవకాశం దక్కింది. అత్యంత కీలకమైన ‘హెల్త్ వర్కింగ్ గ్రూప్'(హెచ్డబ్ల్యూజీ) సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. మొత్తం నాలుగు నగరాల్లో సదస్సులు జరుగనుండగా, ఇందులో హైదరాబాద్ కూడా ఒకటి.
నగరంలో జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు (డయాగ్నొస్టిక్స్), ఔషధాల లభ్యత పెంపు, పరిశోధనల కోసం జీ-20 దేశాలు అమలు చేయాల్సిన ప్రణాళికపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తో పాటు తిరువనంతపురం(కేరళ), గోవా, అహ్మదాబాద్(గుజరాత్)లో సదస్సులు జరుగుతాయి.