హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఏ ప్రాజక్టు చేపట్టాలన్నా అందులో అత్యంత కీలకం భూ సేకరణ. ఇది ఎంతో సంక్లిష్టమైనదే కాకుండా భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మంజూరు చేసిన కేంద్రం భూ సేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపింది. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చులను మాత్రం టోల్ట్యాక్స్లు, సెస్సుల ద్వారా కేంద్రమే వసూలు చేసుకుంటుంది. భూసేకరణ ఖర్చులు మాత్రమే సగం రాష్ట్రం భరించాలంటూ మెలికపెట్టి, ప్రాజెక్టును ముందుకు సాగనీయకుండా రాష్ట్రంపై నెపం వేస్తున్నది. తాజాగా ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు పేరుతో మరో ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు రాష్ర్టానికి ఎంతో ప్రయోజనకారి అయినప్పటికీ భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తే మేల నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రయోజనాలు, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగురోడ్డును ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో 340 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల ఆర్ఆర్ఆర్ ఎక్స్ప్రెస్వేను కేంద్రం మంజూరు చేసింది. సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్గల్, శంకరపల్లి తదితర పట్టణాల మీదుగా దీనిని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఉత్తర, దక్షిణ భాగాల పేరుతో రెండు భాగాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఉత్తర భాగం కింద రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 164 కి.మీ. మేర రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ తదితర పట్టణాల మీదుగా వెళ్తుంది. దక్షిణ భాగం కింద రూ.6,480 కోట్లతో 182 కి.మీ. మేర రోడ్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించగా, ఇది చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి తదితర పట్టణాల మీదుగా వెళ్తుంది.
ఈ రహదారి నిర్మాణంలో భూసేకరణే కీలకాంశం. భూసేకరణకు దాదాపు రూ.5,300 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. ఇందులో సగం రాష్ట్రం భరిస్తేనే ప్రాజెక్టును చేపడతామని కేంద్ర రహదారుల శాఖ మెలికపెట్టింది. భూములు కోల్పోతున్న రైతులతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ, భూసేకరణ చేసి ఇస్తేనే ప్రాజెక్టు చేపడతామని జాతీయ రహదారుల శాఖ చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఇప్పటికే తమ వాటా కింద రూ.100 కోట్లు విడుదలచేసింది. కేంద్రం ఏర్పాటుచేసే రహదారులకు అయ్యే ఖర్చును టోల్, రోడ్ సెస్సుల రూపంలో వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖ ర్చులు ముందుగా ఏజెన్సీ భరించి అనంతరం ట్యాక్స్ రూపంలో వడ్డీతోసహా వసూలు చేస్తుంది.
ప్రజల అవసరాలు, అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుండగా, కేంద్రం ఇందుకు భిన్నం గా వ్యవహరిస్తున్నది. రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారంతో తమకు సంబంధం లేదని, భూసేకరణ చేస్తే నే ప్రాజెక్టు ముందుకు సాగుతుందని కేంద్రంలోని బీజేపీ నేతలు స్పష్టంచేస్తున్నారు. రాష్ట్ర అవసరాలు ఎంత ముఖ్యమో, రైతుల ప్రయోజనాలూ అంతే ముఖ్యమని రాష్ట్రం వాదిస్తున్నది. కేంద్రం అతితెలివి ప్రదర్శిస్తూ భూమి ఇస్తే రోడ్డు వేస్తామని, భూసేకరణ తో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కేంద్రం పెట్రోల్, డీజిల్పై రోడ్డు సెస్సు, టోల్ట్యాక్స్ల పేరుతో ఏటా రూ.వేల కోట్లు వసూలు చేస్తున్నది. ఇందులో రాష్ర్టానికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. కేంద్రం తలుచుకుంటే మొత్తం భూసేకరణ, రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా భరించే అవకాశం ఉన్నది. కానీ, భూసేకరణ భారాన్ని రాష్ట్రంపై మోపి తాము రోడ్డు నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయడంలేదనే వాదనను తెరపైకి తెస్తున్నది.
ట్రిపుల్ఆర్ చుట్టూ సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి బుధవారం ప్రకటించారు. దీంతో రైలు కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా ప్ర యాణికులు, సరుకు రవాణాకు ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే ఈ ప్రాజె క్టు వల్ల విజయవాడ, గుంటూరు, వరంగల్, మెదక్, ముంబై రైల్వేలైన్లకు ఔటర్ రింగ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు కూడా భారీగా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. భూసేకరణ సహా పూర్తిగా ప్రాజెక్టు వ్యయం కేంద్రం భరిస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందనడంలో సందేహంలేదు. భూసేకరణ, ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం వాటా ఇవ్వాలంటూ మెలిక పెట్టకుండా పూర్తిగా కేంద్రం నిధులతోనే పూర్తిచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.