హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. వచ్చే వేసవినాటికి నగరవాసులకు అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మంగళవారం కోకాపేట ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వెళ్లే సర్వీసు రోడ్డులో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్ వెంట మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా దీనిని నిర్మిస్తున్నట్టు తెలిపారు. గండిపేట చెరువు చుట్టూ 46 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.