డాటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పిస్తుండటంతో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోల్ ఎస్ కంపెనీలు భారీ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన డాటా సెంటర్ల నిర్మాణానికి ఆసియా ఖండంలోనే హైదరాబాద్ నగరం భౌగోళికంగా, వాతావరణ పరంగా ఎంతో అనుకూలమని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగులను ఆయా కంపెనీలు నియమించుకొంటున్నాయి. మహేశ్వరం, చందన్వెల్లి ప్రాంతాల్లో అమెజాన్ డాటా సెంటర్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి.