హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘నువ్వు రాసిన కథ చాలా బాగుంది.. నిర్మాణ సంస్థకు నచ్చింది. నీ కథను దాదాపు ఎంపిక చేశారు. కానీ.. నువ్వు కూడా కొంత పెట్టుబడి పెట్టాలి. సినిమా రైట్స్ తీసుకోవడానికి ఖర్చవుతుంది. సినిమాలో హీరో కూడా నువ్వే’ అంటూ ఇద్దరు వ్యక్తులు చెప్పగానే నమ్మేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.93 లక్షలు ఇచ్చి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో రెండు పెద్ద సినీ నిర్మాణ సంస్థలతోపాటు ఫిల్మ్ ఛాంబర్‌పై ఆరోపణలు చేశాడు. దీంతో పోలీసులు అక్టోబర్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుడు, పోలీసుల కథనం మేరకు కొండాపూర్‌కు చెందిన ఆకాశ్ వర్మ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2022లో తన స్నేహితుల ద్వారా మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సిరి చందన అనే యువతి పరిచయమైంది. తాను సినిమాలు డైరెక్షన్ చేస్తానని, ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకున్నది. తనకు కూడా సినిమాలంటే ఇష్టమని, ఒక కథ కూడా రాసుకున్నానని ఆకాశ్వర్మ చెప్పాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని ఆ మహిళ తెలిపింది. ఆ తర్వాత సాయి బొల్ల, విజయ్‌ని పరిచయం చేసింది. సాయి ఫిల్మ్ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శినని, విజయ్ ఓ బడా నిర్మాణ సంస్థలో ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నారు. అంతా కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.
2023 ఫిబ్రవరిలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్‌కు ముంబై నుంచి ఓ పెద్ద ఓటీటీ కంపెనీ ప్రతినిధులు వస్తున్నారని సాయి బొల్ల, విజయ్.. ఆకాశ్‌కు చెప్పారు. అప్పటికే షార్ట్‌లిస్ట్ అయిన 12 కథలల్లో నీ కథ కూడా ఉన్నదని తెలిపారు. ఆ పెద్ద కంపెనీతో నీ కథను ఓకే చేయిస్తానని, నువ్వే హీరోగా నటించాలని చెప్పారు. ప్రొడక్షన్లో కూడా భాగస్వామిగా ఉండాలని షరతు పెట్టారు. ఇదే సినిమాను సంబంధించిన హక్కులు, అనుమతులు, లీగల్ ప్రాసెస్ కోసం ఖర్చవుతుందని రూ.93 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల మ రింత డబ్బు ఇవ్వాలని సాయి బొల్ల కోరగా.. ఆకాశ్ నిరాకరించాడు. డబ్బు ఇవ్వకపోతే సినిమాలో నుంచి తొలగిస్తామని సాయి బొల్ల బెదిరించాడు. ఆ తర్వాత టచ్‌లో లేకుండా పోయాడు. ఈ వ్యవహారంపై ఆకాశ్వర్మ అక్టోబర్‌లో గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో సాయి బొల్లపై పోలీసులకు కేసు నమోదు చేశారు.
సిరి చందన, సాయి బొల్ల పథకం ప్రకారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్, మైత్రీ మూవీస్, నెట్‌ఫ్లిక్స్ పేర్లు వాడుకొని ఆకాశ్ వర్మను మోసం చేశారని ప్రాథమికంగా తెలుస్తున్నది. బాధితుడు డబ్బంతా సాయి బొల్ల ఖాతాలోకే పంపించాడని గుర్తించాం. సాయి బొల్ల ఖాతాను ఫ్రీజ్ చేశాం. నిందితుడు కోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ వేశాడు. కోర్టు ఆదేశాలతో స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకున్నాడు. సాయి బొల్ల బ్యాంకు ఖాతాను విశ్లేషించాల్సి ఉన్నది. అతని నుంచి డబ్బులు ఎవరికి వెళ్లాయో దర్యాప్తులో తేలుతుంది. బాధితుడికి వచ్చిన ఈ మెయిల్స్ అసలైనవా? నకిలీవా? అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉన్నది.
-శివారెడ్డి, ఎస్సై, దర్యాప్తు అధికారి, గచ్చిబౌలి పీఎస్