హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడు-మూడున్నరేండ్ల్లలో రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి వచ్చే అక్టోబర్‌లో ప్రధాని చేతులమీదుగా పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. వివిధ అభివృద్ధి పనులపై మంత్రి కోమటిరెడ్డి బుధవారం అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. అందులో ఒకటి వరంగల్‌లో 24 అంతస్తులతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఉస్మానియా దవాఖానను అదేచోట, ప్రస్తుతమున్న డిజైన్ ప్రకారమే పునర్నిర్మించేందుకు అన్ని రాజకీయపక్షాలు ఒప్పుకున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.700 కోట్లతో నల్లగొండ బైపాస్ రోడ్డును, మంచిర్యాల్-ఆర్మూర్ రోడ్లను మంజూరు చేయించామని అన్నారు.
ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్ రింగు నిర్మాణంపై కూడా ప్రతిపాదన ఉన్నదని, దానికి కూడా డీపీఆర్‌లు రూపొందిస్తామని చెప్పారు. ఔటర్ రింగురోడ్డుకు ట్రిపుల్-ఆర్కు మధ్య రేడియల్ రోడ్లను నిర్మించడంతోపాటు లాజిస్టిక్స్ హబ్‌లు, హార్డ్‌వేర్ పార్క్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తదితరవాటిని అభివృద్ధి చేయనున్నామని, ఇది నగరాభివృద్ధిలో ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని చెప్పారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య ఆరులేన్లు
నవామి గంగ, సబర్మతి ప్రాజక్టుల తరహాలోనే మూసీ ప్రక్షాళన కూడా చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. హైదరాబాద్-విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనున్నామని, వచ్చే డిసెంబర్‌కల్లా పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చౌటుప్పల్ వద్ద రూ.375 కోట్లతో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు.
అలాగే, హైదరాబాద్- బెంగుళూరు, హైదరాబాద్-నాగపూర్ రహదారులను కూడా ఎక్స్‌ప్రెస్‌వేలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులను నెలరోజుల్లో ప్రారంభిస్తామని, అలాగే అంబర్పేట్ ఫ్లైఓవర్‌ను వచ్చే మూడు నెలల్లోగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అల్వాల్ వద్ద 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి త్వరలోనే డీపీఆర్‌ను రూపొందిస్తామని చెప్పారు. త్వరలోనే ఢిల్లీలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు.
శ్రీశైలం హైవేపై ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్- శ్రీశైలం హైవేపై నల్లమల అటవీ ప్రాంతంలో రూ.6000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ను, రూ.5600 కోట్లతో హైదరాబాద్- బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నామని మంత్రి చెప్పారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్ల బిల్లులను త్వరలోనే చెల్లించనున్నట్టు తెలిపారు. రాజేంద్రనగర్‌లో వచ్చే రెండేండ్లలో రూ.100 కోట్లతో దేశంలోనే అత్యుత్తమమైన హైకోర్టును నిర్మించనున్నామని, త్వరలోనే ఆర్కిటెక్ట్‌ను ఫైనల్ చేస్తామని చెప్పారు. పాటిగడ్డ ప్రాంతంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తామని, దీనికి స్థలం సిద్ధంగా ఉన్నదని, డీపీఆర్ సిద్ధమవుతున్నదని వివరించారు.