హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్స్ హైదరాబాద్‌కు చేరుకొన్నది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ బాక్స్‌ను డిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి తీసుకొచ్చారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఈ ఎన్నికలకు హైదరాబాద్ ఏఆర్వోగా వ్యవహరిస్తున్న ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్, సీఈవో కార్యాలయ అసిస్టెంట్ సెక్రటరీ విజయ్‌కిషోర్ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశ్వినీకుమార్ మొహల్.. హైదరాబాద్ నుంచి వెళ్లిన బృందానికి బ్యాలెట్‌బాక్స్‌ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకొన్నది. బ్యాలెట్‌బాక్స్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ అసెంబ్లీలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.